Published : 20 Sep 2021 15:18 IST

Afghanistan: పురుషులు చేయకూడని పనులకు మాత్రమే హాజరు కావాలి..

మహిళల ఉద్యోగాలు హరీ.. ఇళ్లకే పరిమితమవ్వాలంటూ కాబుల్‌ మేయర్‌ ఆదేశాలు 

కాబుల్‌: తాలిబన్లు స్త్రీల హక్కులను పరిరక్షిస్తారన్నది కేవలం భ్రమేనని మరోసారి రుజువైంది! అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో మున్సిపాలిటీలోని మహిళా ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమవ్వాలని వారు ఆదేశించారు. పురుషులు చేయకూడని/చేయలేని పనుల్లో ఉన్న కొంతమంది మాత్రమే విధులకు హాజరు కావాలని పేర్కొంది. అతివల టాయిలెట్లలో పనిచేయడాన్ని ఇందుకు ఉదాహరణగా సూచించింది. కాబుల్‌ తాత్కాలిక మేయర్‌ హమ్దుల్లా నమోనీ ఆదివారం ఈ మేరకు తమ ఆదేశాలను వివరించారు. నగరంలో దాదాపు 3 వేలమంది మున్సిపాలిటీ ఉద్యోగులున్నారు. వారిలో మహిళలు 33% వరకు ఉంటారు. తాజా ఆదేశాల నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగాలకు దూరం కానున్నారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

జలాలాబాద్‌లో పేలుడు ;  ఐదుగురి మృత్యువాత 

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లపై బాంబు దాడులు కొనసాగుతున్నాయి. జలాలాబాద్‌ నగరంలో తాలిబన్లకు చెందిన ఓ వాహనమే లక్ష్యంగా ఆదివారం ఓ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. జలాలాబాద్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ. 

అఫ్గాన్‌ ప్రాజెక్టులపై తుది నిర్ణయం ప్రధానిదే: గడ్కరీ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో అక్కడ భారత్‌ చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై తుది నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటారని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదివారం తెలిపారు. రెండు దశాబ్దాలుగా అఫ్గాన్‌లో వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భారత్‌ పెట్టుబడులు పెట్టింది. సల్మా డ్యామ్‌ను నిర్మించింది. ఇంకా చాలా ప్రాజెక్టులు తాలిబన్ల ఆక్రమణతో మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో గడ్కరీ మాట్లాడుతూ.. అఫ్గాన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. అక్కడి ప్రాజెక్టులపై నిర్ణయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌తో కలిసి మోదీ తీసుకుంటారని పేర్కొన్నారు. అఫ్గాన్‌లో భారత్‌ దాదాపు మూడు వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

అఫ్గాన్‌ పరిణామాలపై సౌదీతో భారత్‌ చర్చలు: ఆ దేశ విదేశాంగ మంత్రితో జైశంకర్‌ భేటీ 

దిల్లీ: తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై భారత్, సౌదీ అరేబియా తాజాగా చర్చలు జరిపాయి. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్‌ బిన్‌ ఫర్హాన్‌ అల్‌ సౌద్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ దిల్లీలో ఆదివారం భేటీ అయ్యారు. అఫ్గాన్‌ పరిణామాలతో పాటు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపైనా వారు చర్చించారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో దేశానికి అండగా నిలిచినందుకుగాను సౌదీకి జైశంకర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌ నుంచి సౌదీకి ప్రయాణాలపై ప్రస్తుతమున్న ఆంక్షలను మరింతగా సడలించాలని విన్నవించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫైసల్‌ శనివారం భారత్‌కు వచ్చారు. ప్రధాని మోదీతో ఆయన సోమవారం భేటీ కానున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని