Global temperatures: భూమండలం మండిపోతోంది.. హెచ్చరించిన ఐరాస నివేదిక

వాతావరణ మార్పుల ఉద్ధృతిపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.

Published : 20 Sep 2021 10:28 IST

ఈ శతాబ్ది చివరకు 2.7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు

ఐరాస: వాతావరణ మార్పుల ఉద్ధృతిపై ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది. భూ ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయని, ఈ శతాబ్ది చివరినాటికి అవి పారిశ్రామికీకరణ ముందు కన్నా 2.7 డిగ్రీల సెల్సియస్‌ అధిక స్థాయికి చేరుకునే ముప్పు పొంచి ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ప్రపంచ ఉద్గారాల కట్టడి లక్ష్యాలకు సంబంధించి వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐరాస విభాగం విడుదల చేసిన నివేదికలో శాస్త్రవేత్తలు వెల్లడించిన విషయాలివీ..

- వాతావరణ సంక్షోభం వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలను నివారించాలంటే భూ ఉష్ణోగ్రతలను పారిశ్రామికీకరణ ముందు కన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌ లోపే పరిమితం చేయాలి. 

- ఈ శతాబ్ది మధ్య కల్లా కార్బన్‌ తటస్థతను సాధించాలంటే భూమిపై ఉద్గారాలను 2030 కల్లా 45 శాతం తగ్గించాలి.

- ఉద్గారాల కట్టడికి సంబంధించి వివిధ దేశాలు సమర్పించిన నివేదికల ప్రకారం 2030లో ఉద్గారాల పరిమాణం 2010తో పోలిస్తే 16 శాతం పెరగనుంది. 

- ఆగస్టు నివేదిక ప్రకారం ఇప్పటికే భూ ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీలకు చేరుకున్నాయి. దీని పర్యవసనాలు ఇప్పటికే పలు దేశాల్లో కనిపిస్తున్నాయి. 

విపత్తు దిశగా పుడమి

ప్రస్తుతం పుడమి విపత్తు దిశగా సాగుతోందని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భూ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలకే పరిమితం చేసేలా ఆరేళ్ల క్రితం కుదిరిన పారిస్‌ ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైతే పెద్ద ఎత్తున ప్రాణనష్టంతో పాటు ఉపాధి మృగ్యమవుతుందని హెచ్చరించారు. ఉష్ణోగ్రతల కట్టడి లక్ష్యాన్ని సాధించడానికి అన్ని వనరులు ఉన్నాయని, కానీ సమయమే అత్యంత వేగంగా తరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలను సాధించడానికి అభివృద్ధి చెందిన దేశాలు దశాబ్దం క్రితం వాగ్దానం చేసిన లక్ష కోట్ల డాలర్ల సాయాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందించాలని కోరారు. అన్ని దేశాలు వాతావరణ మార్పుల నివారణకు కట్టుబడి కృషి చేస్తేనే ఫలితం ఉంటుందని సీఓపీ26కు కాబోయే అధ్యక్షుడు అలోక్‌ శర్మ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు