women police: మహిళా కానిస్టేబుళ్ల పని గంటల తగ్గింపు

ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు

Updated : 25 Sep 2021 12:22 IST

ముంబయి: ఎంత లాఠీ చేతబట్టి ఖాకీ దుస్తుల్లోకి మారినా.. ‘ఇంటికి దీపం ఇల్లాలే’ అనే నానుడి మహిళా పోలీసులకు కూడా వర్తిస్తుందని మహారాష్ట్ర పోలీసు విభాగం గుర్తించింది. వృత్తి జీవితాన్ని, ఇంటి బాధ్యతలను సమతుల్యం చేసుకునేలా మహిళా కానిస్టేబుళ్ల పనివేళలను 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని నాగ్‌పుర్, అమరావతి నగరాలతోపాటు పుణె గ్రామీణ విభాగంలో గత నెల ప్రయోగాత్మకంగా అమలుచేసిన ఈ నూతన విధానాన్ని రాష్ట్రమంతా పాటించేలా డీజీపీ సంజయ్‌ పాండే ఆమోదం తెలిపారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్నప్పటికీ మహిళా కానిస్టేబుళ్లకు ఇంటిపరంగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నెలరోజుల కిందట తాము ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టిన ఆలోచనకు పెద్దఎత్తున స్పందన వచ్చినట్లు ఓ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఈ విధానానికి నాగ్‌పుర్‌ పోలీస్‌ కమిషనర్‌ అమితేశ్‌ కుమార్‌ మొట్టమొదటిసారి ఆగస్టు 28న శ్రీకారం చుట్టారు. వెసులుబాటు కల్పించాక మహిళా కానిస్టేబుళ్లు తమ పిల్లలకు, కుటుంబసభ్యులకు కొంత సమయం ఇవ్వగలుగుతున్నట్లు అధికారి వెల్లడించారు. పైగా పనిగంటలు తగ్గించాక మహిళా కానిస్టేబుళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా విధి నిర్వహణలో పాల్గొంటున్నారని అమరావతి నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్తీసింగ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని