Coronavirus: మరో 6-8 వారాలు జాగ్రత్త..

కరోనా మహమ్మారి విషయంలో వచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు

Published : 25 Sep 2021 11:17 IST

కొవిడ్‌ ముందు పరిస్థితులు రావాలంటే అప్రమత్తతే ముఖ్యం
ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో వచ్చే 6 నుంచి 8 వారాల పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరిస్తే.. మనం దీన్నుంచి బయటపడి కొవిడ్‌ ముందు నాటి పరిస్థితులకు వెళ్లొచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా పేర్కొన్నారు. దిల్లీలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మహమ్మారి పూర్తిగా పోలేదని, అందువల్ల ప్రజలు రాబోయే పండగల సీజన్‌లో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. వ్యాక్సిన్‌ రోగాన్ని తీవ్రం కాకుండా చూస్తుందని, టీకా తీసుకున్నవారికి ఎవరికైనా ఒకవేళ కొవిడ్‌ సోకినా అది తేలికపాటి దశకే పరిమితమవుతుందన్నారు. అయితే టీకాలు తీసుకున్నవారి ద్వారా.. వ్యాక్సిన్‌ తీసుకోనివారికి వైరస్‌ సోకితే అలాంటివారిలో తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ఈమేరకు అందరూ తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించారు. కొవిడ్‌ విషయంలో ప్రస్తుతం దేశంలో ఆశావహ పరిస్థితులున్నాయని, రోజురోజుకీ వైరస్‌ తిరోగమనంలో సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని ఆయన స్పష్టం చేశారు. పండగల సీజన్‌ మళ్లీ కేసులను పెంచే పరిస్థితికి తీసుకురాకూడదన్నారు. మనం మహమ్మారి అంతాన్ని చూడాలనుకుంటున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు, గుంపులుగా చేరడం మానుకోవాలన్నారు.

కొవిడ్‌ చికిత్స నుంచి ఐవర్‌మెక్టిన్, హెచ్‌సీక్యూ తొలగింపు

కరోనా చికిత్సకు అందించే ఔషధాల నుంచి ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)ని తొలగిస్తూ భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), కొవిడ్‌-19 నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌లు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొవిడ్‌ బాధితుల్లో మరణాలు, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఇవి పెద్దగా ప్రభావం చూపడం లేదని, అందువల్ల వాటిని జాబితా నుంచి తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అజిత్రోమైసిన్‌తో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఇచ్చినప్పుడు దాని ప్రభావం తీవ్రంగా ఉంటోందన్నది కూడా మరో కారణమని పేర్కొన్నాయి. ఎయిమ్స్‌ నిర్వహించిన అధ్యయనంలోనూ ఐవర్‌మెక్టిన్‌ వల్ల వైరల్‌ లోడ్‌లో కానీ, రోగ లక్షణాలు కొనసాగే సమయంలో కానీ తగ్గుదల కనిపించలేదని తేలింది.

3 లక్షలకు చేరువగా క్రియాశీలక కేసులు 24 గంటల్లో 31,382 మందికి పాజిటివ్‌

దిల్లీ: దేశంలో క్రమేపీ తగ్గుముఖం పడుతున్న కొవిడ్‌ క్రియాశీలక కేసుల సంఖ్య శుక్రవారం 3 లక్షలకు చేరువైంది. రోజువారీ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 31,382 మంది కొత్తగా వైరస్‌ బారిన పడగా.. 318 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3,35,94,803కి చేరగా.. ఇంతవరకు 4,46,368 మంది మహమ్మారికి బలైపోయారు. మొత్తం 3,28,48,273 మంది కొవిడ్‌ను జయించారు. రికవరీ రేటు 97.78%కి పెరిగింది.

* ఒక్క రోజులో 32,542 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. క్రియాశీలక కేసుల సంఖ్య 3,00,162 (0.89%)కి తగ్గింది. 188 రోజుల్లో ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. 

దేశవ్యాప్తంగా గురువారం 15,65,696 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2% నమోదైంది. 

* గత 24 గంటల్లో కేరళలో 152 మంది కొవిడ్‌తో మృతి చెందారు. మహారాష్ట్రలో 61, తమిళనాడులో 27 మరణాలు సంభవించాయి. 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కొవిడ్‌ మరణమూ నమోదు కాకపోవడం ఊరటనిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని