Updated : 29/09/2021 11:42 IST

Covid: కొవిడ్‌తో సహజీవనం తప్పదు.. బూస్టర్‌ డోసు అవసరమేనా?

దిల్లీ: కొవిడ్‌-19 కారక వైరస్‌ ఇప్పుడప్పుడే మానవాళిని వదలబోదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సీనియర్‌ అధికారి పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. దీర్ఘకాలం పాటు అది ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తూనే ఉంటుందని చెప్పారు. కొంతకాలానికి మహమ్మారి నుంచి ‘ఎండెమిక్‌’ స్థాయికి దిగివస్తుందా అన్నది.. టీకాలు, మునుపటి ఇన్‌ఫెక్షన్‌ ద్వారా సమాజంలో ఉత్పన్నమయ్యే రోగనిరోధకతపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆ రక్షణను అధికంగా కలిగి ఉన్నచోట్ల భవిష్యత్‌లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటుందని పూనమ్‌ వివరించారు. డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా విభాగానికి ప్రాంతీయ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆమె.. ‘పీటీఐ’ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వైరస్‌పై పూర్తి పట్టు సాధించే పరిస్థితి ఉండాలని సూచించారు. ఆ మహమ్మారి గుప్పెట్లో మనం విలవిలలాడే పరిస్థితి పోవాలన్నారు. ‘కొవాగ్జిన్‌’ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులిచ్చే విషయంపై సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఆమోదం లభిస్తుందని తెలిపారు.

బూస్టర్‌ డోసు అవసరమేనా?
టీకా తీసుకోని వారి కారణంగానే చాలావరకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని పూనమ్‌ తెలిపారు. టీకాలను బూస్టర్‌ డోసుల కోసం వినియోగించడం వల్ల.. మొదటి డోసు కోసం నిరీక్షిస్తున్న కోట్ల మందికి ఇబ్బంది అవుతుందన్నారు. అందుకే... బూస్టర్‌ డోసు వినియోగంపై 2021 చివరి వరకు మారటోరియం విధించాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చిందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైరస్‌ ముప్పు ఎక్కువగా ఉన్న వారు సహా ప్రతి దేశంలోనూ 40 శాతం జనాభాకు టీకాలు అందేలా చూడటం దీని ఉద్దేశమని చెప్పారు. ‘‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండేవరకూ ఏ ఒక్కరూ సురక్షితం కాదని మనం గుర్తుంచుకోవాలి’’ అని స్పష్టంచేశారు. కొంతకాలం తర్వాత తీవ్రస్థాయి ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షించడంలో కొవిడ్‌ టీకాల సమర్థత తగ్గుతుందనడానికి కచ్చితమైన ఆధారలేమీ లేవన్నారు. తీవ్ర వ్యాధి, మరణాల ముప్పును ఇవి తగ్గిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే భవిష్యత్‌లో కొన్ని వర్గాలకు బూస్టర్‌ డోసులు అవసరం కావొచ్చని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా దీనిపై డబ్ల్యూహెచ్‌వో సూచనలు చేస్తుందన్నారు.

ముంబయిలో మంగళవారం టీకా తీసుకున్నాక సెల్ఫీ దిగుతున్న ఉపాధ్యాయులు

ఇదో అరుదైన అవకాశం..
కరోనా నిర్మూలన సాధ్యంకాకపోవచ్చని పూనమ్‌ పేర్కొన్నారు. అయితే ప్రజలంతా నిబంధనలను  పాటించడం, ఎక్కువ మంది టీకా తీసుకోవడం ద్వారా.. దేశంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చన్నారు. మరో దశ ఉద్ధృతి చెలరేగకుండా అడ్డుకోవచ్చని తెలిపారు. ఇదే విషయం వివిధ దేశాల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. విదేశాలకు కొవిడ్‌ టీకాలను మళ్లీ ఎగుమతి చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె ప్రశంసించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వయోధికులు, కరోనా ముప్పు అధికంగా ఉన్నవారికి టీకా అందిస్తూనే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ పంపిణీ సమానంగా జరిగేలా చూడాలని కోరారు. తద్వారా వైరస్‌లో కొత్త వేరియంట్లు ఉత్పన్నం కాకుండా కూడా చూడొచ్చని తెలిపారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని