
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం.. ముగ్గురి కాల్చివేత
శ్రీనగర్: ఉగ్రమూకలు మరోమారు రెచ్చిపోయి, వేర్వేరు సంఘటనల్లో మంగళవారం ముగ్గురు కశ్మీర్ పౌరులను కాల్చిచంపాయి. శ్రీనగర్‌లోని ప్రముఖ కశ్మీరీ పండిట్, మఖన్‌లాల్ బింద్రూ ఫార్మసీ యజమాని బింద్రూ(68) స్థానిక ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. బింద్రూను పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చారు. 1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ ఒకరు. ఈ దుర్ఘటన జరిగిన మరో గంట వ్యవధిలో.. శ్రీనగర్ శివారులోని హవల్ ప్రాంతంలో భేల్పూరి విక్రయిస్తున్న స్థానికేతరుడైన వీధి వర్తకుడు వీరేందర్‌ను ముష్కరులు కాల్చి చంపారు. రెండో దాడి జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాందీపుర జిల్లాలో ఉగ్రవాదులు మూడోదాడికి పాల్పడ్డారు. నయిద్‌ఖాయ్ ప్రాంతంలో స్థానిక ట్యాక్సీ స్టాండ్ అధ్యక్షుడైన మహమ్మద్ షఫీ లోనెను కాల్చిచంపారు.