
17 ఏళ్లుగా అడవిలోనే.. లగ్జరీ కారులో..
కర్ణాటకలోని మంగళూరు జిల్లా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరంతోడ్ గ్రామంలోని అద్దేల్-నెక్కారే అడవిలో ప్రయాణిస్తుంటే ప్లాస్టిక్ కవర్ కప్పిన ఓ చిన్న గుడిసె తారసపడుతుంది. దానిలోపల ఆ రోజుల్లోనే లగ్జరీ వాహనంగా పేరొందిన ‘ప్రీమియర్ పద్మిని కారు’, ఓ రేడియో, పాత సైకిల్ దర్శనమిస్తాయి. అలాగే ఆ గుడిసెలోనే మాసిన గడ్డం, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులతో ఓ వ్యక్తి దర్శనమిస్తాడు. అతడే 56 ఏళ్ల చంద్రశేఖర్. గతంలో నెక్రల్-కెమ్రాజీ అనే గ్రామంలో చంద్రశేఖర్‌కు 1.5 ఎకరాల పొలం ఉండేది. దానిని సాగు చేసుకునేవాడు. 2003లో సహకార బ్యాంకు నుంచి రూ. 40వేల రుణం తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చకపోవడంతో పొలాన్ని వేలం వేశారు. ఇది భరించలేని చంద్రశేఖర్ తనకిష్టమైన ‘ప్రీమియర్ పద్మిని కారుతో’ సోదరి వద్దకు వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తరువాత తన సోదరి కుటుంబంతో విభేదాలొచ్చాయి. దీంతో సొంత గ్రామానికి వెళ్లలేక.. ఆత్మగౌరవం అడ్డొచ్చి.. కారుతో అడవిలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ చోట కారును నిలిపి.. వర్షం, ఎండ నుంచి దానిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు. జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి.. సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరకులు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇబ్రహీం.. స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇల్లు కట్టించి ఇచ్చినా.. దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. మరోవైపు.. అటవీ వనరులు, జంతువులకు చంద్రశేఖర్ ఎలాంటి హాని తలపెట్టలేదని.. అందువల్ల తమకు అతనితో ఎలాంటి సమస్య లేదని అటవీ శాఖ సిబ్బంది చెప్పడం విశేషం.