Parliement: పార్లమెంటు పాత భవనం సురక్షితం కాదు

ప్రస్తుతం వినియోగంలో ఉన్న పార్లమెంటు భవనం ఎంత మాత్రం సురక్షితమైనది కాదని, వలస పాలకుల సమయంలో నిర్మించిన ఈ కట్టడం పాతదై పోయిందని కేంద్ర గృహ

Published : 10 Oct 2021 13:44 IST

నిర్ణీత గడువులోనే కొత్త కట్టడం సిద్ధం
కేంద్రమంత్రి హరదీప్‌ సింగ్‌ వెల్లడి

దిల్లీ: ప్రస్తుతం వినియోగంలో ఉన్న పార్లమెంటు భవనం ఎంత మాత్రం సురక్షితమైనది కాదని, వలస పాలకుల సమయంలో నిర్మించిన ఈ కట్టడం పాతదై పోయిందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హరదీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. ముందుగా నిర్ణయించిన గడువులోపే కొత భవన సముదాయం సిద్ధమవుతుందని శనివారం ‘ఇండియా టుడే కాంక్లేవ్‌ 2021’ కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా పార్లమెంటు కొత్త భవన నిర్మాణంతో పాటు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకూ రాజ్‌పథ్‌ను పునఃనిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘స్వాతంత్య్రానంతరం పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అందువల్ల వసతుల పెంపుకోసం అనేక మార్పులు చేయాల్సి వస్తోంది. ఇక నిర్మాణపరంగా చూస్తే ప్రస్తుత భవనం సురక్షితం కాదు. భూకంప ముప్పును సూచించే సైస్మిక్‌జోన్‌-4 పరిధిలో అది ఉంది. వలసపాలకులు ఆ భవనాన్ని నిర్మించే సమయంలో ఆ ప్రాంతం సైస్మిక్‌ జోన్‌-2 పరిధిలో ఉంది. భయాందోళనలు సృష్టించాలన్నది మా ఉద్దేశం కాదు. వాస్తవ పరిస్థితిని చెబుతున్నాం’ అని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరులో నిర్వహించే శీతాకాల పార్లమెంటు సమావేశాలు కొత్త భవనంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్లమెంటు భవనం కోసం రూ.800 కోట్లు, మూడు కి.మీ.దూరం ఉండే రాజ్‌పథ్‌ పునఃనిర్మాణం కోసం రూ.400 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని