
Afghan Crisis: అఫ్గాన్‌లో ఆధిపత్య పోరు
కుదురుకోవడానికి తాలిబన్ల ప్రయత్నం
అస్థిరపర్చేందుకు ఐఎస్ కుట్రలు
కాబుల్: అఫ్గానిస్థాన్‌పై ఆధిపత్యం కోసం తాలిబన్లతో తలపడుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) పెద్దఎత్తున రక్తపాతం సృష్టిస్తోంది. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత అఫ్గాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తాలిబన్లు అధికారంలో కుదురుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అస్థిరతను వ్యాపింపజేయడానికి ఐఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో దేశ రాజధాని నగరం కాబుల్‌లో ఐఎస్ రెండు పేలుళ్లకు తెగబడింది. కాబుల్ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది అమెరికా సైనికులు, 169 మంది అఫ్గాన్ పౌరులు మరణించారు. గత శుక్రవారం ఉత్తర రాష్ట్రం కుందుజ్‌లో షియాల మసీదుపై ఐఎస్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారు. ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో నిరంతరం ఏదో ఒకచోట ఐఎస్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు తాలిబన్ ముఠా సభ్యులనూ ఆ సంస్థ లక్ష్యంగా చేసుకుంటూనే ఉంది. అమెరికా, దాని మిత్రదేశాలకు ముప్పుతెచ్చే ఐఎస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద మూకలకు అఫ్గాన్ గడ్డపై స్థానం కల్పించబోమని శాంతి చర్చల్లో తాలిబన్లు అమెరికా ప్రభుత్వానికి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ, ఐఎస్ దూకుడు వల్ల తాలిబన్ తన హామీలను ఎంతవరకు నిలబెట్టుకోగలదో చూడాలి.
విభేదాలకు మత మూలాలు: తాలిబన్, ఐఎస్‌లు రెండూ ఇస్లామిక్ రాజ్య స్థాపనకు కట్టుబడి ఉన్నా తాలిబన్లు తమ ఇస్లామిక్ రాజ్యాన్ని అఫ్గానిస్థాన్‌కు పరిమితం చేస్తున్నారు. ఐఎస్ ప్రపంచ ఖలీఫా రాజ్యాన్ని నెలకొల్పుతాననీ, దాన్ని ముస్లింలు అందరూ సమర్థించాలని డిమాండ్ చేస్తోంది. తాలిబన్ల జాతీయవాదాన్ని.. స్వచ్ఛమైన ఇస్లామిక్ ఉద్యమంగా అది పరిగణించడం లేదు. అల్ ఖైదా భావాలనూ ఐఎస్ వ్యతిరేకిస్తోంది. తాలిబన్, ఐఎస్‌లు రెండూ కఠిన షరియా సూత్రాలకు కట్టుబడి ఉన్నా, ఐఎస్ ఏడాకులు ఎక్కువే చదివింది. సిరియా, ఇరాక్‌లను తన ఏలుబడిలోకి తెచ్చుకున్నప్పుడు షరియా పేరిట ఐఎస్ పలు అఘాయిత్యాలకు పాల్పడింది. 2015లో ఆ సంస్థ అఫ్గానిస్థాన్‌లో ఐఎస్-ఖోరాసాన్ (ఐఎస్-కె) పేరిట కార్యకలాపాలు మొదలుపెట్టింది. అఫ్గాన్, పాకిస్థాన్ ఇస్లామిక్ తీవ్రవాదులను, తాలిబన్ ఫిరాయింపుదారులను తనతో చేర్చుకుంది. తాలిబన్ దాడులు, అమెరికా విమాన దాడులు ఐఎస్-కెని బలహీనపరచినా, అమెరికా సేనల నిష్కమ్రణ తరవాత అది మళ్లీ విజృంభిస్తోంది. తాలిబన్లను అస్థిరపరచి అఫ్గానిస్థాన్ అంతటినీ కానీ, కొంత భాగాన్ని కానీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. అయితే, తాలిబన్ల మాదిరిగా ఐఎస్‌కు పాకిస్థాన్, ఇరాన్‌ల నుంచి ఆశ్రయం కానీ, ఇతరత్రా మద్దతు కానీ లభించదు. కాబట్టి అది అఫ్గాన్‌లో బలపడటం కష్టమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.