
Mohan Bhagwat: కశ్మీర్ సమస్యకు పరిష్కారం అప్పుడే!
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్
నాగ్‌పుర్: జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన అధికరణం 370 రద్దుతో సమస్య మొత్తం తొలగిపోలేదని, ఇప్పటికీ స్వాతంత్య్రం(ఆజాదీ) గురించి మాట్లాడుతున్న వారు భారత్‌లో కలిసిపోతేనే పరిష్కారం లభిస్తుందని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. నాగ్‌పుర్‌లో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆజాదీ కోరుకుంటున్న వారూ మన దేశంలో విలీనమయ్యేలా సమాజం చొరవతీసుకోవాలి. గత నెలలో ముంబయిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జమ్మూకశ్మీర్ ముస్లిం విద్యార్థులు భారత్‌లో తామూ ఓ భాగంకావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకు వారికి ఎలాంటి అవరోధాలు ఉండబోవు’ అని భాగవత్ అన్నారు. అధికరణం 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని, ఇటీవల తన పర్యటనలో ఆ విషయాన్ని గమనించానని తెలిపారు. ‘గతంలో జమ్మూ, లద్దాక్ ప్రాంతాలు తీవ్ర వివక్షకు గురయ్యాయి. 80శాతం ఆర్థిక వనరులు కశ్మీర్ స్థానిక నాయకుల జేబుల్లోకే వెళ్లేవి. ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంతో ప్రజలు వారిని గురించి ఆందోళన చెందడంలేదు’ అని భాగవత్ అన్నారు. ‘తమ చిన్నారుల చేతుల్లో పుస్తకాలకు బదులు రాళ్లు పెట్టిన తల్లిదండ్రులు ఇప్పుడు ఉగ్రవాదులను కీర్తించడం మానేశారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న వాతావరణం అక్కడ నెలకొంది’ అని తెలిపారు. ‘పాకిస్థాన్ ద్వారా ప్రేరణ పొందుతున్న వారు, మనసులో మతతత్వ భావనలు ఉన్న వారే ఆజాదీ డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వారు ఇంకా కొందరున్నారు. భారత్‌లో వారిని విలీనం చేసేలా మన ప్రయత్నాలను ముమ్మరం చెయ్యాలి’ అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.