Working Days: వారంలో నాలుగు రోజులే పని.. శ్రమించే సమయం తగ్గింపుతో మేలే!

గంటల తరబడి ఉసూరుమంటూ పనులుచేసే బదులు, కొద్ది సమయమైనా హుషారుగా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని నిరూపిస్తోంది బుల్లిదేశం ఐస్‌లాండ్‌.

Updated : 19 Oct 2021 12:23 IST

ఐస్‌లాండ్‌లో ఫలించిన ప్రయోగాలు 

రెగ్జవిక్‌: గంటల తరబడి ఉసూరుమంటూ పనులుచేసే బదులు, కొద్ది సమయమైనా హుషారుగా చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయని నిరూపిస్తోంది బుల్లిదేశం ఐస్‌లాండ్‌. ఇదో ఆధునిక ఉద్యోగ సూత్రంగా మారడానికి ఐస్‌లాండ్‌ దారి చూపిస్తోంది. కరోనా పుణ్యమా అని పని స్థలాలు, కార్మికుల పనితీరులో అనేక మార్పులొచ్చాయి. పనివేళల తగ్గింపు ఇందులో ఒకటి. పనివేళల్ని తగ్గించడం ద్వారా ఉత్పాదకతను ఎంతవరకు పెంచవచ్చు అన్న దానిపై కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో అనేక ప్రయోగాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. ఐస్‌లాండ్‌ ప్రభుత్వ విభాగాల్లో దీనిపై 2015 నుంచి 2019 వరకు రెండు ప్రయోగాలు జరిగాయి. అందులో తేలిన ఫలితం ఏమంటే.. పని గంటలు తగ్గిస్తే ‘ఘన విజయం’ లభిస్తుందని!! భవిష్యత్తులో ‘పని వారం’ అంటే నాలుగు రోజులే అన్న భావన స్థిరపడేలా ఈ ప్రయోగ ఫలితాలొచ్చాయి.

ప్రయోగాలు ఎలా చేశారు?

దేశంలోని దాదాపు 2,500 మంది కార్మికుల పై ఐస్‌లాండ్‌ ప్రయోగాలు చేసింది. ‘పని వారా’న్ని తగ్గించడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. సాధారణంగా ఈ దేశంలో వారానికి అయిదు రోజుల పాటు సగటున 44.4 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారానికి దాదాపుగా 36-40 గంటలు పనిచేసేలా మార్పులు చేశారు. ఆదా అయిన సమయాన్ని విశ్రాంతికి, కుటుంబానికి వెచ్చించడంతో ఉద్యోగుల సామర్థ్యం పెరిగింది.  కొన్ని చోట్ల ఉత్పాదకత పెరిగింది.  ఉదాహరణకు రాజధాని రెగ్జవిక్‌లోని ల్యాండ్‌ అండ్‌ ఆపరేషన్‌ ఏజెన్సీని తీసుకుంటే...ఇందులో 140 మంది పనిచేస్తున్నారు. వీరంతా రోడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యం, చెట్ల పెంపకం వంటి పనులు చేస్తుంటారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 

3.30 గంటల వరకు వీరి పనివేళలు ఉంటాయి. కానీ సాధారణంగా 5.30 గంటల వరకు పనిచేస్తూనే ఉంటారు. అదనంగా పని చేసే రెండుగంటలకు ఓవర్‌టైం భృతి చెల్లిస్తుంటారు. ఈ విభాగంలో రెండు రకాల ప్రయోగాలు చేశారు. ఒక చోట...మొత్తం అయిదు రోజులకుగానూ నాలుగు రోజుల్లో పనివేళలను ఒక గంట పాటు తగ్గించారు. వారు సాయంత్రం నాలుగు గంటలకే పనులు ముగించేలా చూశారు. మరో చోట సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఎనిమిది గంటలతో పాటు, శుక్రవారం సగం రోజు మాత్రమే పనిచేసేలా నిబంధనలు పెట్టారు. పనివేళలు తగ్గినా జీతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రతి రోజూ గంట తగ్గింపు విధానానికే ఉద్యోగులు మొగ్గు చూపారు. దీనిపై ఆ విభాగం డైరెక్టర్‌ హజల్టీ గుడ్‌మండ్‌సన్‌ మాట్లాడుతూ  హుషారుగా ఉన్న సమయంలోనే సమర్థంగా పనిచేయడం వల్ల చివరి గంట పని కూడా ముందే చేసినట్టయిందని అభిప్రాయపడ్డారు.

ఎండ దొరికింది.. చాలు!

ఐస్‌లాండ్‌ అంటేనే మంచు ప్రదేశం. ఎండలో ఉంటే బాగుంటుందని ఎవరికైనా అనిపించడం సహజం. పనివేళలు ఓ గంట తగ్గించడం ద్వారా సాయంత్రం అలా అలా ఎండలో తిరగడానికి వీలు కలిగిందని పలువురు సంతోషపడ్డారు. కార్యాలయాల్లో పనిచేసే వారు సుదీర్ఘ సమావేశాల జోలికి వెళ్లడం లేదు.  చాలా మంది ఆరోగ్యం కుదుటపడింది. ‘సిక్‌ లీవ్‌’లు తగ్గడమే ఇందుకు ఉదాహరణ.   పిల్లలతో గడిపే సమయం చిక్కడంతో ఒత్తిడి తగ్గిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల్లో కష్టించే తత్వం, చేస్తున్న పనిపై సంతృప్తి పెరిగిందన్నది అందరి మాటగా వినిపిస్తోంది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని