Published : 23 Oct 2021 11:58 IST

Supreme Court: విచారణపై పోలీసులు ట్వీట్లు చేయొచ్చా?

 దీనికి విధివిధానాలు రూపొందించాలి
 సుప్రీంకోర్టులో వ్యాజ్యం 

దిల్లీ: కేసుల విచారణ వివరాలను పోలీసులు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తున్న వైనంపై విధివిధానాలు రూపొందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు చేపట్టింది. క్రిమినల్‌ కేసుల విచారణ సమాచారాన్ని కొందరు పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుండడం ఇబ్బందికరంగా మారిందని, దీనిపై నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్‌దారు కోరారు. దీనిని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసు ఇచ్చింది. కేసు పూర్వపరాల్లోకి వెళ్తే..అండమాన్‌-నికోబార్‌ దీవులకు చెందిన ఓ మహిళ జులై 30న ఆత్మహత్య చేసుకుంది. తొలుత తన బాధలను వివరిస్తూ వీడియో తీసింది. ఓ కేసు విచారణ సందర్భంగా తనపై ట్వీట్లు చేసిన ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఇందుకు కారణమని అందులో ఆరోపించారు. ఇది మరణ వాంగ్మూలంలాంటిదే అయినప్పటికీ దీని ఆధారంగా చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ దిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు ఈ వ్యాజ్యాన్ని వేశారు.

వ్యాజ్యం ప్రకారం ఆమె ఆత్మహత్యకుగల కారణాలను పరిశీలిస్తే...తప్పుడు ధ్రువపత్రాలతో అండమాన్‌-నికోబార్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగం పొందారని ఆమెపై కేసు నమోదయింది. అయితే ఈ విషయంలో ఒక సీనియర్‌ పోలీసు అధికారి ఆమెపైనా, కుటుంబ సభ్యులపైనా ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశారు. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో ఎలాంటి ట్వీట్లు చేయకూడదంటూ మే 12న ఆయనను ఆదేశించింది. అయితే జులై 30న ఆమె ఆత్మహత్య చేసుకుంది. వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వీడియో తీసింది. అది ఆగస్టు ఒకటో తేదీన సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయింది. దాంతో ఈ కేసుపై ఎలాంటి ప్రకటన చేసినా అది దర్యాప్తులో జోక్యం కిందకే వస్తుందంటూ పోలీసులు ట్వీట్‌ చేశారు. ఆమెకు ఓ ఎస్‌.ఐ.తో సంబంధం ఉందని, ఆయనకు మరో మహిళతో కూడా సంబంధం ఉండడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందంటూ కేసు నమోదయింది. ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ ఎస్‌.ఐ.పై కేసు పెట్టారు. దర్యాప్తుకు విఘాతం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారంటూ గుర్తుతెలియని వ్యక్తులపై మరో కేసు పెట్టారు. కానీ వీడియోలో ఆమె స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఐపీఎస్‌ అధికారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని దావాలో ఆరోపించారు. దర్యాప్తు సమయంలో ఆ మహిళపై ట్వీట్లు చేయడం ద్వారా పలు నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. ఆయనను సస్పెండ్‌చేసి, కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

శాశ్వత సైనికాధికారులుగా 39 మంది మహిళలను నియమించండి

 సైన్యంలో శాశ్వత మహిళా అధికారుల నియామకంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. 39 మంది షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిణులను వారం రోజుల్లోగా పర్మినెంట్‌ కమిషన్‌ అధికారిణులుగా నియమించాలని ఆదేశించింది. ఈ పదవుల కోసం పరిగణనలోకి తీసుకోని మరో 25 మంది విషయమై కారణాలను వివరించాలని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి సూచించింది. తొలుత 72 మంది షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిణుల సేవలు కొనసాగింపు విషయమై సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదిక ఇచ్చింది. వీరిలో 39 మంది పర్మినెంట్‌ కమిషన్‌కు అర్హత పొందారని తెలిపింది. ఒకరు స్వచ్ఛందంగా వైదొలగగా, మరో ఏడుగురికి ఆరోగ్య సామర్థ్యం లేదని పేర్కొంది. క్రమశిక్షణ, నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతో ఇంకో 25 మందికి అవకాశం కల్పించలేమని వివరించింది.

ట్విటర్‌ అధికారికి నోటీసు

 విచారణ నిమిత్తం పోలీసుల ముందుకు వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన అప్పీలుపై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ట్విటర్‌ అధికారిని ఆదేశించింది. వినియోగదారుడు ఒకరు మతపరంగా సున్నితమైన వీడియోను ట్విటర్‌లో పెట్టినందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆ సంస్థ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్‌ మహేశ్వరికి ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు నోటీసు ఇచ్చారు. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా దాన్ని కొట్టివేసింది. అనంతరం హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ యూపీ పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం అమెరికాకు బదిలీ అయిన మనీష్‌ మహేశ్వరికి నోటీసు పంపిస్తున్నట్టు తెలిపింది.

కేడర్‌ కోరే అధికారం ఏఐఎస్‌లకు లేదు

ఫలానా రాష్ట్ర కేడర్‌ కావాలని కోరే హక్కు ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి ఆల్‌ ఇండియా సర్వీసు (ఏఐఎస్‌) అధికారులకు లేదని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. హిమాచల్‌ప్రదేశ్‌లో నియామకం పొందిన ఎ.షైనమోల్‌ అనే మహిళా ఐఏఎస్‌ అధికారిని స్వరాష్ట్రం కేరళకు బదిలీ చేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఈ వివరణ ఇచ్చింది. 

సామూహిక వంటశాలల ఏర్పాటుపై విచారణ అంగీకారం తెలిపిన :సీజేఐ జస్టిస్‌ రమణ 

ఆకలి, పౌష్టికాహారం లోపాలను నివారించడానికి సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలన్న అంశాన్ని అత్యవసర విచారణల జాబితాలో చేర్చడానికి శుక్రవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ విషయమై ఓ విధానాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు నోటీసులు ఇవ్వాలంటూ వ్యాజ్యం దాఖలయింది. ‘‘దీనిపై నోటీసు ఇచ్చే ధర్మాసనానికి నేను ఆధ్వర్యం వహిస్తున్నాను’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఈ ధర్మాసనంలో ఆయనతో పాటు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలు సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 27న విచారణ జరపనున్నట్టు తెలిపారు. పేదల కోసం సామూహిక వంటశాలలు ఏర్పాటు చేయాలంటూ ముగ్గురు సామాజిక కార్యకర్తలు గతంలో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాణ పత్రాలను సమర్పించాయో జాబితా రూపొందించాలని వారి తరఫు న్యాయవాది అసిమా మండ్లాను ధర్మాసనం ఆదేశించింది. ఆరు రాష్ట్రాలు ఇప్పటికీ ఎలాంటి ప్రమాణ పత్రాలు సమర్పించకపోవడంతో రూ.5 లక్షల వంతున జరిమానా విధించింది.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని