
Variant Under Investigation: ముసురుకుంటున్న ముప్పు!
బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తున్న ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్’
ఆస్ట్రేలియాలో టీకా తీసుకోనివారిపై ఆంక్షలు
లండన్: కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించి, పలు మార్పులు సంతరించుకోవడం మరో సవాలుగా మారింది. వివిధ వేరియంట్ల కారణంగా బ్రిటన్, రష్యాలతో పాటు... చైనా, ఆస్ట్రేలియా, ఉక్రెయిన్, సెర్బియా, క్రొయేషియా, స్లొవేనియా, రొమేనియాల్లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రష్యాలో తాజా మరణాలు వెయ్యి మార్కును దాటాయి. దీంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్నది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్ (ఏవై.4.2) వేరియంట్‌ను యూకే ఆరోగ్య భద్రత సంస్థ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ (వీయూఐ-21ఓసీటీ-01)గా పేర్కొంది. డెల్టాను మించిన వేగంతో ఇది విస్తరిస్తున్నా, తీవ్ర ప్రమాదకరమైనది కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో కేసులు పెరగడానికి వైరస్ ప్రవర్తనలో వస్తున్న మార్పులే కారణమా? లేక సాంక్రమిక వ్యాధులకు అనుకూలమైన వాతావరణం నెలకొనడమా? అన్న విషయంపై పరిశోధకులు దృష్టి సారించారు. బ్రిటన్‌లో ఈనెల 20న నమోదైన కేసుల్లో 15,120 వీయూఐ-21ఓసీటీ-01 వేరియంట్ సోకడం వల్ల తలెత్తినవేనని, మొత్తం కేసుల్లో ఇవి 6% ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
రష్యాలో కేసులు, మరణాలు పైపైకి...
రష్యాలో కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా 37,678 కేసులు, 1,075 మరణాలు చోటుచేసుకున్నాయి. సెప్టెంబరు నాటి గణాంకాలతో పోలిస్తే, ఇప్పుడు కేసులు 70%, మరణాలు 33% అధికంగా నమోదవుతున్నాయి.
- ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతుండటంతో... టీకా తీసుకోనివారిపై ఆంక్షలు విధించాలని యోచిస్తున్నట్టు ఛాన్సలర్ అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ వెల్లడించారు. ‘‘ఐసీయూల్లోని 500 పడకలు కొవిడ్ బాధితులతో నిండితే మళ్లీ కఠిన ఆంక్షలు తప్పవు. టీకాలు తీసుకున్నవారినే హోటళ్లు, రెస్టారెంట్లలోకి ప్రవేశం కల్పిస్తాం. మిగతావారు ప్రత్యేక కారణం ఉంటే తప్ప బయటకు రావడానికి వీలుండదు’’ అని షాలెన్‌బర్గ్ పేర్కొన్నారు.
- ఉక్రెయిన్‌లో మునుపెన్నడూ లేనంతగా తాజాగా 23,785 కేసులు, 614 మరణాలు నమోదయ్యాయి. రాజధాని కీవ్, మరికొన్ని చోట్ల ఆంక్షలు విధించారు.
- చైనాలో తాజాగా 47 కేసులు నమోదైనట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.