Imran Khan: భారత్‌-పాక్‌ మధ్య ‘కశ్మీర్‌’ ఒక్కటే సమస్య: ఇమ్రాన్‌

భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు.

Updated : 26 Oct 2021 11:10 IST

టి-20 మ్యాచ్‌ నేపథ్యంలో దీనిపై ఇప్పుడు చర్చించడం సరికాదని వ్యాఖ్య

ఇస్లామాబాద్‌: భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరముందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. అయితే, టి-20 క్రికెట్‌ మ్యాచ్‌లో తమ జట్టు విజయం సాధించిన తరుణంలో ఈ అంశంపై చర్చించడం సరికాదన్నారు. సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఆహ్వానం మేరకు ఇమ్రాన్‌ఖాన్‌ మూడు రోజులపాటు ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రియాద్‌లో సోమవారం ఏర్పాటుచేసిన పాక్‌-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం సమావేశంలో ఇమ్రాన్‌ మాట్లాడినట్టు డాన్‌ పత్రిక పేర్కొంది.

‘‘భారత్, పాకిస్థాన్‌లు పరిష్కరించుకోవాల్సిన సమస్య ఒక్కటే- కశ్మీర్‌ అంశం. కశ్మీర్‌ ప్రజల, మానవ హక్కులకు సంబంధించిన విషయమిది. ఐరాస భద్రత మండలి హామీ ఇచ్చిన ఈ హక్కులు వారికి దఖలు పడితే చాలు. ఉభయ దేశాల మధ్య వేరే సమస్యలేవీ లేవు. చైనాతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్‌తో సంబంధాలు కూడా మెరుగుపడితే రెండు దేశాలు ఎంత శక్తిమంతంగా ఉంటాయో ఊహించండి. అప్పుడు నాగరిక సమాజాలుగా అవి మరింత ముందుకువెళ్లే అవకాశం ఉంటుంది. అదే జరిగితే... పాకిస్థాన్‌ మీదుగా మధ్య ఆసియా ప్రాంతాన్ని భారత్‌ సులభంగా చేరుకునే వీలుంటుంది. పాకిస్థాన్‌కు కూడా పెద్ద మార్కెట్లు చేరువవుతాయి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి నిత్యం మారుతూ ఉంటాయి. టి-20 మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్‌ జట్టు విజయం సాధించిన తరుణంలో ఉభయ దేశాల సంబంధాలపై మాట్లాడటం సరికాదు’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని