
Corona Vaccine: టీకా పొందిన వారి ద్వారా కూడా ‘డెల్టా’ వ్యాప్తి
లండన్: కరోనా వైరస్‌లో ఉద్ధృతంగా వ్యాపించే డెల్టా రకానికి సంబంధించి పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. టీకాలు పొందినవారు కూడా.. ఇంటి వాతావరణంలో ఈ వేరియంట్ బారినపడొచ్చని, వారి ద్వారా అది ఇతరులకూ వ్యాపించొచ్చని పేర్కొన్నారు. అయితే టీకా వేయించుకోని వారితో పోలిస్తే ఇలాంటివారి ద్వారా వ్యాప్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని తెలిపారు. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజీ లండన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. ఆ వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్’లో ప్రచురితమయ్యాయి. వ్యాక్సిన్ పొందినవారిలో ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే గరిష్ఠ వైరల్ లోడు మాత్రం ఇతరులతో సమానంగానే ఉంటుందన్నారు. వారి ద్వారా ఇళ్లల్లో వైరస్ వ్యాప్తి జరగడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. ‘‘కొవిడ్ వ్యాప్తి చాలా వరకూ గృహాల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందుతుందన్నది తెలిసిన విషయమే. అయితే వ్యాక్సిన్ పొందినవారి ద్వారా గృహాల్లో డెల్టా వేరియంట్ వ్యాప్తి గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు. మహమ్మారిని అదుపు చేయడానికి టీకాలు కీలకం. కొవిడ్ సోకినవారిని తీవ్ర అనారోగ్యం, మరణం బారి నుంచి కాపాడటంలో అవి సమర్థత చాటుతున్నాయి. అయితే ఇళ్లల్లో డెల్టా రకం వ్యాప్తిని అడ్డుకోవడంలో వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని మా అధ్యయనం చెబుతోంది’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ అజిత్ లాల్వానీ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.