
B-1B Lancer Bomber: పశ్చిమాసియా మీదుగా అమెరికా బాంబర్ చక్కర్లు
మిత్రదేశాలకు బైడెన్ భరోసా
దుబాయ్: పశ్చిమాసియా సముద్రతీరంలోని కీలకమైన రవాణా మార్గాల మీదుగా అమెరికాకు చెందిన బీ-1బీ లాన్సర్ బాంబర్ వెళ్లినట్లు స్వయంగా అమెరికా వైమానిక దళం ప్రకటించింది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల మీదుగా అగ్రరాజ్య బాంబర్ దూసుకెళ్లటం ప్రాధాన్యం సంతరించుకుంది. బీ-1బీ బాంబర్‌ను పంపించి మిత్రదేశాలకు బైడెన్ భరోసా కల్పిస్తున్నారని అమెరికా నావికాదళ సెంట్రల్ కమాండ్ ట్వీట్ చేసింది. బీ-1బీ బాంబర్ దక్షిణ డకోటాలోని 37వ బాంబ్ స్క్వాడ్రన్ నుంచి వచ్చింది. శనివారం ఈ బాంబర్.. హార్ముజ్ జలసంధి, ఎర్రసముద్రం, ఈజిప్టులోని సూయజ్ కాలువల మీదగా ప్రయాణించింది. ప్రపంచవ్యాప్తంగా 20 శాతం ముడిచమురు వ్యాపార వాణిజ్యానికి హార్ముజ్ జలసంధి కేంద్రబిందువుగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ప్రచ్ఛన్నయుద్ధ క్రమంలో హార్ముజ్ జలసంధి, ఎర్రసముద్రంలోని వాణిజ్య స్థావరాలపై వరుస దాడులు జరిగాయి. అయితే, ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ స్పష్టంచేసింది. తాజా ఘటనలో అమెరికన్ బాంబర్‌తోపాటు బహరీన్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాల ఫైటర్ విమానాలు కూడా పయనించాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని వెంటనే ధ్రువీకరించలేదు. ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ ప్రతినిధులు కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయకుండా సంయమనం పాటించారు. ఇరాన్‌కు తమ ఆధిపత్యం చూపేందుకు గతంలో ట్రంప్ హయాంలోనూ ఈ విధమైన సంఘటనలు జరిగాయి.
ఒప్పందం పునరుద్ధరణకు బైడెన్ సుముఖం
మరోవైపు.. ఇరాన్‌తో 2015 నాటి అణు ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని షరతులతో సుముఖంగా ఉన్నారు. అణు కార్యక్రమం విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు శ్వేతసౌధం ఇటీవల వెల్లడించింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015లో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందం నుంచి 2018లో ట్రంప్ హయాంలో అమెరికా వైదొలగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.