Updated : 02 Nov 2021 07:27 IST

Mumbai Drugs Case: ఫడణవీస్‌ భార్యతో డ్రగ్స్‌ వ్యాపారి ఫొటోలు

 ట్వీట్‌ చేసిన నవాబ్‌ మాలిక్‌

ఖండించిన మాజీ సీఎం

ముంబయి/దిల్లీ: మహారాష్ట్ర రాజకీయాలను మాదక ద్రవ్యాల అంశం కుదిపేస్తోంది. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, ఆయన భార్య అమృతా ఫడణవీస్‌కు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) సీనియర్‌ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ సోమవారం ఆరోపించారు. ఈ మేరకు మాదకద్రవ్యాల వ్యాపారి జైదీప్‌ రానాతో ఫడణవీస్‌ దంపతులు దిగిన ఫొటోలను ట్వీట్‌ చేశారు. ‘‘భాజపాకు, డ్రగ్స్‌ దళారుల మధ్య సంబంధాలపై చర్చిద్దాం’’ అని వ్యాఖ్యానించారు. మాలిక్‌ ట్వీట్‌పై దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. డ్రగ్స్‌ వ్యాపారులతో తనకు సంబంధం లేదని, ఫొటోలో ఉన్న వ్యక్తి.. ఓ స్వచ్ఛంద సంస్థ కార్యక్రమంలో తమతో ఫొటోలు దిగారని వివరణ ఇచ్చారు. మాలిక్‌కు అండర్‌ వరల్డ్‌ మాఫియాతో సంబంధాలున్నాయని, ఆ వివరాలను దీపావళి తర్వాత వెల్లడిస్తానని ఫడణవీస్‌ పేర్కొన్నారు. దీనిపై ‘నేను సిద్ధంగా ఉన్నా’ అంటూ మాలిక్‌ ట్వీట్‌ చేశారు.

ఎస్సీ కమిషన్‌ను కలిసిన వాంఖడే

తప్పుడు కుల ధ్రువీకరణ పత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే.. సోమవారం జాతీయ ఎస్సీ కమిషన్‌(ఎన్‌సీఎస్‌సీ) ఛైర్‌పర్సన్‌ విజయ్‌ సంప్లాను కలిశారు. తన కుల ధ్రువీకరణ పత్రంతో పాటు...తొలి వివాహానికి సంబంధించిన విడాకుల పత్రాలనూ అందజేశారు. వీటిని తాము సరిచూస్తామని, ఒక వేళ పత్రాలు నిజమని తేలితే.. వాంఖడేపై ఎలాంటి చర్యలూ ఉండవని సంప్లా తెలిపారు. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో వాంఖడే ఉద్యోగం సంపాదించారని.. అతను ముస్లిం అంటూ ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటుడు షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ డ్రగ్స్‌ కేసును వాంఖడే విచారిస్తున్నారు.

వాట్సప్‌ సంభాషణలు సరిపోవు

కేవలం వాట్సప్‌ సంభాషణలు ఆధారంగా ఆర్యన్‌ఖాన్‌కు, అర్బాజ్‌ మర్చంట్‌కు సహ నిందితుడు ఆచిత్‌ కుమార్‌ మాదక ద్రవ్యాలు సరఫరా చేశాడని నిర్ధారించలేమని ‘క్రూయిజ్‌ డ్రగ్స్‌’ కేసులో ముంబయి ప్రత్యేక న్యాయస్థానం తెలిపింది. గతవారం ఆచిత్‌కు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. అందుకు  సంబంధించి సవివర ఉత్తర్వులను ఆదివారం విడుదల చేసింది. ఇందులో వాట్సప్‌ సంభాషణల ఆధారంగా ఆచిత్‌ నేరాన్ని నిర్ధారించలేమని న్యాయమూర్తి తెలిపారు. పంచనామాపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ దొరికిన ప్రదేశంలో పంచనామా నిర్వహించినట్లు లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts