Submarine info leak: జలాంతర్గాముల సమాచారం లీక్‌ కేసులో కొత్త మలుపు

జలాంతర్గాముల ఆధునికీకరణకు సంబంధించి రెండు ప్రాజెక్టుల సున్నిత సమాచారాన్ని లీక్‌ చేసిన వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం రెండు అభియోగపత్రాలు

Published : 03 Nov 2021 12:59 IST

సీబీఐ అభియోగపత్రంలో హైదరాబాద్‌ సంస్థ ప్రతినిధుల పేర్లు
ఇద్దరు నౌకాదళ కమాండర్లు, విశ్రాంత అధికారుల పేర్లు కూడా

దిల్లీ: జలాంతర్గాముల ఆధునికీకరణకు సంబంధించి రెండు ప్రాజెక్టుల సున్నిత సమాచారాన్ని లీక్‌ చేసిన వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మంగళవారం రెండు అభియోగపత్రాలు దాఖలు చేసింది.  మొదటి అభియోగపత్రంలో నౌకాదళ విశ్రాంత కమొడోర్‌ అధికారి రణ్‌దీప్‌సింగ్, విశ్రాంత కమాండర్‌ ఎస్‌జే సింగ్‌ (ప్రస్తుతం కొరియా కంపెనీలో పనిచేస్తున్నారు)ల పేర్లను ప్రస్తావించారు. రెండో దాంట్లో వీరిద్దరితోపాటు, ప్రస్తుతం కమాండర్‌గా పనిచేస్తున్న అజిత్‌కుమార్, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అలెన్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టీపీ శాస్త్రి, డైరెక్టర్లు ఎన్‌బీ రావు, కె.చంద్రశేఖర్‌ల పేర్లను చేర్చారు. సీబీఐ అదుపులో ఉన్న మరో నౌకాదళ అధికారి ఒకరి పేరును ప్రస్తుత అభియోగపత్రాల్లో చేర్చలేదు. త్వరలో దాఖలుచేసే అనుబంధ అభియోగపత్రంలో అతని పేరు చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు ఆర్థిక సంబంధమైన ప్రతిఫలం కోసం కీలక సమాచారాన్ని విశ్రాంత అధికారులకు చేరవేశారని అభియోగపత్రాల్లో సీబీఐ పేర్కొంది. సమాచారాన్ని లీక్‌ చేసిన వ్యవహారానికి సంబంధించి సెప్టెంబరు రెండో తేదీన సోదాలు నిర్వహించిన సీబీఐ మరుసటి రోజు నౌకాదళ విశ్రాంత కమొడోర్‌ అధికారి రణ్‌దీప్‌సింగ్, విశ్రాంత కమాండర్‌ ఎస్‌జే సింగ్‌ (ప్రస్తుతం కొరియా కంపెనీలో పనిచేస్తున్నారు)లను అరెస్టు చేసింది. ఈ సోదాల్లో వలపన్నేందుకు ఉపయోగించిన నగదు సహా మొత్తం రూ.2.40 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అనంతరం నౌకాదళ కమాండర్‌ అజిత్‌ కుమార్‌ సింగ్, మరో కమాండర్‌ను అదుపులోకి తీసుకుంది. చివరగా హవాలా నిర్వాహకుడు ఒకరు, ఓ ప్రైవేటు కంపెనీ డైరెక్టర్‌ను అరెస్టు చేసింది. మరోవైపు, ఈ కేసులో తొలి అరెస్టు జరిగిన సెప్టెంబరు మూడో తేదీ నుంచి 60 రోజుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడం విశేషం. ఫలితంగా నిందితులకు అంత త్వరగా బెయిలు లభించే అవకాశం ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని