Joe biden: చైనా పెద్ద తప్పు చేసింది: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

పర్యావరణ మార్పులపై అత్యంత కీలకమైన కాప్‌-26 సదస్సుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడాన్ని అమెరికా

Updated : 04 Nov 2021 17:36 IST

జి-20, కాప్‌-26 సదస్సులకు గైర్హాజరవడంపై బైడెన్‌ వ్యాఖ్య 


గ్లాస్గో: పర్యావరణ మార్పులపై అత్యంత కీలకమైన కాప్‌-26 సదస్సుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ప్రత్యక్షంగా హాజరు కాకపోవడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. గ్లాస్గో వేదికగా జరిగిన ఈ మహా సమావేశాల్లో వందకు పైగా దేశాలు గ్రీన్‌హౌజ్‌ వాయు ఉద్గారాల తగ్గింపు దిశగా కృషిచేసేందుకు పలు హామీలు ఇచ్చాయని, చైనా మాత్రం అలాంటి భరోసా ఇవ్వడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. జి-20 సదస్సుతో పాటు కాప్‌-26కు డుమ్మా కొట్టడం ద్వారా చైనా పెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే శక్తిని ఆ దేశం కోల్పోయిందని ఎద్దేవా చేశారు. గ్లాస్గోలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బైడెన్‌ ఈ మేరకు మాట్లాడారు. అంతర్జాతీయ వేదికలపై చైనాను బహిరంగంగా ఎదుర్కొనేందుకు తాను ఏమాత్రం వెనుకాడబోనని తాజా వ్యాఖ్యలతో ఆయన స్పష్టం చేసినట్లయింది. 

రాజకీయ పరిస్థితులే కారణమా..! 

ప్రపంచ నేతల ముందు తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న ఆందోళన వల్లే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జి-20, కాప్‌-26 సదస్సుకు గైర్హాజరయ్యారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షింజియాంగ్‌ ప్రాంతంలో ముస్లింలను చైనా సర్కారు అణచివేస్తున్నతీరుపై చాలాకాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాంకాంగ్‌లో ఆ దేశం పౌర హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండటాన్నీ అంతర్జాతీయ సమాజం గర్హిస్తోంది. తాజా సదస్సుల్లో దానిపై ప్రశ్నలు ఎదురవుతాయేమోన్న ఆందోళనతో జిన్‌పింగ్‌ వాటికి డుమ్మా కొట్టినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు- చైనాలో కొన్నాళ్లుగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఆ పరిస్థితులూ ఆయన గైర్హాజరీకి కారణమయ్యుండొచ్చని కొందరు వివరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు