TS News: పెద్ద పులికి.. చావుభయం

అమృత మహోత్సవాల్లో భాగంగా పెద్ద పులుల ప్రాణాల్ని కాపాడాలంటూ ర్యాలీలు జరుగుతున్న తరుణంలోనే వ్యాఘ్రాల వరుసహత్యలు 

Updated : 04 Nov 2021 14:26 IST

నాలుగు నెలల్లో 3 హతం

వ్యాఘ్రాల సంరక్షణలో అటవీశాఖ ఘోర వైఫల్యం

ఈనాడు, హైదరాబాద్‌: అమృత మహోత్సవాల్లో భాగంగా పెద్ద పులుల ప్రాణాల్ని కాపాడాలంటూ ర్యాలీలు జరుగుతున్న తరుణంలోనే వ్యాఘ్రాల వరుసహత్యలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 105 పులులు మరణించాయి. రాష్ట్రంలో నాలుగు నెలల వ్యవధిలోనే మూడు మరణాలు వెలుగుచూశాయి. తెలంగాణలో జులై 29న ఏటూరునాగారంలో, అక్టోబరు 3న తాడ్వాయి అడవుల్లో, అక్టోబరు 31న ఇంద్రవెల్లి అటవీప్రాంతంలో పులి చర్మాలు పట్టుబడ్డాయి. స్మగ్లర్లు చర్మం, గోర్లను అమ్మకానికి పెట్టడాన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు స్పష్టమవుతోంది. తాజాగా దొరికిన చర్మం ఏడాదిక్రితం ఉచ్చులో చిక్కుకుని మరణించిన మగ పులిదిగా తేలింది. అంటే పులి కనిపించకుండాపోయి, హత్యకు గురై ఏడాది దాటినా అటవీశాఖ అధికారులు గుర్తించలేకపోయారన్నది సుస్పష్టం. ఇదే కాదు ఫాల్గుణ సహా ‘కె’సిరీస్‌లో కొన్ని పులుల జాడ కనిపించడం లేదు. ‘పెద్దపులి ఏ ప్రాంతంలో ఉంది? ఎటువైపు వెళుతుంది? అనేది తెలుసుకునేలా నిత్యం దాని కాలిజాడలను ట్రాక్‌ చేయాలి. అవసరమైనప్పుడు ప్రత్యేక బృందాలు ఉండాలి. కెమెరా ట్రాప్‌లతో పరిశీలించాలి. ఒక్కరోజు గుర్తులు దొరక్కపోతే నిద్ర పట్టేదికాదు. అది కనిపించేదాకా గాలించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు’ అని పేరు చెప్పడానికి ఆసక్తి చూపని ఓ అధికారి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘నాలుగేళ్లకోసారి కేంద్రం అధికారికంగా ప్రకటించే లెక్కలు మినహాయించి రాష్ట్ర అటవీశాఖ అధికారులు పెద్దపులుల సంఖ్య, అవి ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయాలు వెల్లడించడం లేదు. అసలు ఆ సమాచారం వారి వద్ద ఉందో లేదో కూడా తెలియదని’ ఆయన అభిప్రాయపడ్డారు.

అమలుకు నోచుకోని టైగర్‌ టాస్క్‌ఫోర్స్‌

రాష్ట్రంలోని టైగర్‌ రిజర్వుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఇక్కడ వన్యప్రాణి విభాగాన్నే తీసేశారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ (ఎన్టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం ప్రతి టైగర్‌ రిజర్వులో వంద మంది సాయుధులతో టైగర్‌ టాస్క్‌ఫోర్సు ఉండాలి. కానీ, రాష్ట్రంలో ఎక్కడా దీన్ని ఏర్పాటు కాలేదు. రెండేళ్ల క్రితం వీటి ఏర్పాటుపై చర్చ జరిగినా.. కార్యరూపం దాల్చలేదు. ఏపీఎస్పీలో పోలీసు సేవలను పులుల రక్షణకు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి పులులు వస్తున్నా.. అవి స్థిరపడటానికి కాకుండా చనిపోవడానికే వస్తున్నట్లుగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించడం అటవీ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది.

చిత్రాల్ని తిప్పేశ్వర్‌కు పంపించాం

ఇంద్రవెల్లిలో దొరికిన చర్మాన్ని పరిశీలించాం. అది మూడేళ్ల వయసు మగ పులిదని నిర్ధారణయింది. ఇక్కడి పులుల ఫొటోలతో అది సరిపోలలేదు. మహారాష్ట్రలో తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వులోనిదై ఉంటుందని అనుమానిస్తున్నాం. చర్మం సహా ఇతర నమూనాల ఫొటోలను అక్కడి అధికారులకు పంపించాం.-శాంతారాం, డీఎఫ్‌వో, ఆసిఫాబాద్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు