Corona Virus: ఐరోపాలో కొవిడ్‌ ఉద్ధృతి 

ఐరోపాలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. వరుసగా ఐదో వారం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

Updated : 04 Nov 2021 17:36 IST

వరుసగా ఐదోవారం కేసుల పెరుగుదల

జెనీవా: ఐరోపాలో కొవిడ్‌ కలకలం రేపుతోంది. వరుసగా ఐదో వారం కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో కొవిడ్‌ ఉద్ధృతి ఐరోపా ప్రాంతంలోనే పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం తెలిపింది. ఈమేరకు 6% కేసులు పెరిగినట్లు తాజా వారాంతపు నివేదికలో వెల్లడించింది. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో కేసులు తగ్గడం లేదా నిలకడగా కొనసాగడం కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫెక్షన్‌ రేటు కూడా ఐరోపాలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి లక్ష జనాభాకు 192 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఈ రేటు 72గా ఉంది. ప్రధానంగా బ్రిటన్, రష్యా, టర్కీ, రొమేనియాల్లో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. బ్రిటన్‌లో కొవిడ్‌ నిబంధనలను తిరిగి విధించాలని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి. 

8% పెరిగిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాలు 8% పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ప్రధానంగా ఆగ్నేయాసియాలో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. సంపన్న దేశాల్లో కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ వేస్తుండగా.. చాలామేర పేద దేశాలకు టీకాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. గత వారంలో సంపన్న దేశాల్లో ప్రతి రోజూ 10 లక్షల వరకు బూస్టర్‌ డోసులు వేసినట్లు తెలిపింది. పేద దేశాల్లో ఒక రోజులో వేస్తున్న డోసుల కంటే ఇది 3 రెట్లు అధికమని తెలిపింది. కాగా ఈ వారంలో పశ్చిమాసియాలో కొత్త కేసులు 12 శాతం తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో తగ్గుదల 9% ఉన్నట్లు పేర్కొంది. 

చైనాలో ‘డెల్టా’ కలకలం

బీజింగ్‌: కొవిడ్‌ కట్టడికి ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్న చైనాలో కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ప్రధానంగా డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది. బుధవారం 100కి పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. బీజింగ్‌లో 9 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. గత కొద్ది వారాల్లో ఇన్ని ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. అత్యధికంగా రష్యా సరిహద్దుల్లో ఉన్న హెయిలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్సులో 35 కేసులు బయటపడ్డాయి. హెబేయ్, గాన్సు, ఇన్నర్‌ మంగోలియా, చోంకింగ్, కింఘై, జియాంగ్జీ, యున్నన్, నింగ్జియా, సిచువాన్‌ ప్రాంతాల్లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో బుధవారం నాటికి వెయ్యి మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. వారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉంది.

24 గంటల్లో 11,903 కేసులు

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య బుధవారం కొంతమేర పెరిగింది. గత 24 గంటల్లో 11,903 కొత్త కేసులు నమోదు కాగా.. 14,159 మంది కోలుకున్నారు. 311 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 1,480 కేసులు పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 3,43,08,140కి చేరగా.. వీరిలో 3,36,97,740 మంది కొవిడ్‌ను జయించారు. మహమ్మారి బారినపడి ఇంతవరకు 4,59,191 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని