Solar Power: 7 ఏళ్లు.. 17 రెట్లు.. సౌర విద్యుత్తు సామర్థ్యం పెరిగిన తీరు 

సౌర విద్యుత్తు సామర్థ్యం గత ఏడేళ్లలో 17 రెట్లు పెరిగి 45 గిగావాట్లకు చేరుకుందని భారత్‌ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 17% మందికి భారత్‌ ప్రాతినిధ్యం

Published : 08 Nov 2021 10:35 IST

కాప్‌-26 సదస్సులో వెల్లడించిన భారత్‌

గ్లాస్గో, లండన్‌: సౌర విద్యుత్తు సామర్థ్యం గత ఏడేళ్లలో 17 రెట్లు పెరిగి 45 గిగావాట్లకు చేరుకుందని భారత్‌ వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 17% మందికి భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాయు ఉద్గారాల్లో తమ వాటా నాలుగు శాతమేనని తెలిపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహాదారుడు, శాస్త్రవేత్త జె.ఆర్‌.భట్‌ ఆదివారం గ్లాస్గోలో కాప్‌-26 శిఖరాగ్ర సదస్సులో ఒక ప్రకటన చేశారు. 2005-14 మధ్య ఉద్గారాల తీవ్రతను 24% మేర తగ్గించామనీ, ప్రస్తుతం వార్షిక గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలు ఐదు శాతం మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాతావరణ మార్పుల విషయంలో భారత్‌ చేస్తున్న ప్రయత్నాలను వివిధ పక్షాలు అభినందించాయి. వాతావరణ మార్పుల వల్ల వర్థమాన దేశాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందనీ, దీనిని అడ్డుకోవాలంటే అంతర్జాతీయ సహకారం మరింత పెరగాలని భారత్‌ పేర్కొంది. ప్రజా భాగస్వామ్యంతో అడవుల విస్తీర్ణాన్ని, మడ అడవుల్ని పెంచగలిగినట్లు తెలిపింది. సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాల సంఖ్య కూడా ఐదారేళ్లలో పెరిగిందని వివరించింది. 

భారత్‌-బ్రిటన్‌ ప్రతిపాదనలకు అమెరికా మద్దతు 

భారత్‌-బ్రిటన్‌ నేతృత్వంలోని హరిత గ్రిడ్లలో భాగస్వామ్యం తీసుకోవడం ద్వారా అండగా నిలవాలని అమెరికా నిర్ణయించింది. ‘ఒకే సూర్యుడు- ఒకే ప్రపంచం- ఒకే గ్రిడ్‌’ కింద తాము భాగస్వాములమవుతామని అమెరికా ఇంధన శాఖ మంత్రి జెన్నిఫెర్‌ గ్రాన్‌హోమ్‌ తెలిపారు. మొత్తం మానవాళి ఒక ఏడాదిలో వాడే విద్యుత్తు.. సూర్యుని నుంచి భూమ్మీదికి ఒక గంటలో వచ్చే సూర్యరశ్మికి సమానమని చెప్పారు. తదుపరి తరం సౌర ఫలకాలు, సాంకేతికతలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు ఆమె వివరించారు.
సుస్థిర వ్యవసాయ కార్యాచరణపై భారత్‌ సంతకం సుస్థిర వ్యవసాయ కార్యాచరణపై భారత్‌ సహా 27 దేశాలు సంతకాలు చేయనున్నాయి. ఈ రంగం ద్వారా కాలుష్యం తక్కువ వెలువడేలా చూస్తామని భారత్‌ ప్రతినబూనింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని