128 చదరపు అడుగుల ఫ్లాటు.. ధర రూ.6 కోట్ల పైమాటే

400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

Updated : 15 Nov 2021 11:22 IST

మైక్రో, నానోఫ్లాట్లలోనే సగం మంది జీవనం
ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్‌లో జీవన వైచిత్రి

హాంకాంగ్‌: 400 చదరపు అడుగుల ఇల్లంటే... ఇంత ఇరుకా అనుకుంటాం. అలాంటిది కేవలం 128 చదరపు అడుగుల్లోనే నివసించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకాశహర్మ్యాల నగరం హాంకాంగ్‌లో ఎక్కడచూసినా ఇలాంటి బుల్లి ఫ్లాట్లే! అలాగని వీటి ధరలేమీ తక్కువ కాదు. ఈ బుల్లి ఇంటిని సొంతం చేసుకోవాలంటే... కనీసం రూ.6 కోట్లు పెట్టాల్సిందే. 

220 చదరపు అడుగుల ఇల్లు అనగానే... ‘వావ్‌! ఇంత విశాలమైన ఇల్లా’ అని హాట్‌ కేకుల్లా కొనేసుకుంటారు హాంకాంగ్‌లో. ఎందుకంటే ఇక్కడ 128 చదరపు అడుగుల (14.22 చదరపు గజాల) ఫ్లాట్లు కోకొల్లలు. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో హాంకాంగ్‌ ఒకటి. దీని విస్తీర్ణం 1,106 చదరపు కిలోమీటర్లు. ఇందులో కేవలం 7% భూభాగమే నివాస ప్రాంతం. మిగతా భూభాగాన్ని కొండలకు, ప్రకృతి ఆవాసాలకు, పార్కులకు విడిచిపెట్టారు. ఇక ఇక్కడి ప్రస్తుత జనాభా సుమారు 75 లక్షలు. ఒక్క చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో 49 వేల మంది నివసిస్తున్నారు. తక్కువ స్థలంలో నివసించే జీవనశైలికి 1960ల్లోనే ఇక్కడ బీజం పడింది. జనాభా పెరుగుతుండటంతో, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యను ముందే ఊహించిన అప్పటి హాంకాంగ్‌ గవర్నర్‌ లార్డ్‌ మాక్‌లెహోస్‌... 

75% భూభాగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ నివాసేతర ప్రాంతంగానే ఉంచాలని నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడ ఆకాశహర్మ్యాలు వెలిశాయి. కారు నిలపడానికి అవసరమైన దానికంటే తక్కువ స్థలంలో సొంత ఫ్లాట్‌ దొరికితే చాలు... మహద్భాగ్యమే ఇక్కడ!

సూక్ష్మ గృహోద్యమంతో...

‘నీకు సొంతిల్లు లేదంటే... అది నీ సమస్యే’ అన్న భావన హాంకాంగ్‌లో అత్యంత బలంగా ఉంది. దీంతో కనీసం ఒక్క ఫ్లాట్‌ అయినా కొనుక్కోవాలన్న లక్ష్యం అందరిలోనూ కనిపిస్తుంది. ఈ డిమాండుకు తగ్గట్టు సూక్ష్మ గృహోద్యమం పుట్టుకొచ్చి... 128, 168, 220 తదితర చదరపు అడుగుల నానోఫ్లాట్లతో కూడిన టవర్ల నిర్మాణం ఊపందుకొంది. కరోనాకు ముందు 2019లో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతున్నప్పుడు... ఇలాంటి సుమారు 8,500 ఫ్లాట్లు చటుక్కున అమ్ముడుపోయాయి. 

లోపల ఏమేం ఉంటాయి?

సగటు ఇంటి విస్తీర్ణంతో పోలిస్తే, దానికి సగం స్థలంలో నిర్మించిన ఇళ్లను మైక్రోఫ్లాట్స్‌ అంటారు. ఇవి సుమారు 290 చదరపు అడుగుల్లో ఉంటాయి. అంతకంటే తక్కువ విస్తీర్ణం ఉండేవాటిని నానోఫ్లాట్స్‌ అంటారు. ఆధునిక వసతులతో వీటిని అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తారు. అక్కడికక్కడే ఒక మంచం, అర, మరుగుదొడ్డి, కిచెన్‌ ఉంటాయి. బాత్రూంలో కుండీపైనే స్నానం చేయడానికి అవసరమైన షవర్‌ను అమర్చేస్తారు. కిచెన్‌లో ఇన్‌బిల్ట్‌గా మైక్రోవోవెన్‌ ఉంటుంది.

కనిపించని అసంతృప్తి... 

మైక్రో, నానో ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా హాంకాంగ్‌ సర్కారు కూడా గృహనిర్మాణ నిబంధనలను ఎప్పటికప్పుడు సడలిస్తూ వస్తోంది. జనాభాలో దాదాపు సగం మందికి సొంత మైక్రో, నానోఫ్లాట్లు ఉన్నాయి. అద్దెకు ఇచ్చేందుకు మాత్రం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మిస్తుంటారు. ఇలాంటి వాటిలో వేల మంది జీవనం సాగిస్తున్నారు. మిగతా దేశాలవారితో పోల్చితే తాము అత్యంత చిన్న గదుల్లో జీవిస్తున్నామన్న అసంతృప్తి ఇక్కడివారిలో అంతగా కనిపించడంలేదు. పైగా, కుటుంబం పెద్దదయ్యేకొద్దీ పెద్ద ఇళ్లలోకి వెళ్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు!

కోట్లు గుమ్మరించాల్సిందే

హాంకాంగ్‌లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. 128 నుంచి 288 చదరపు అడుగుల ఫ్లాట్ల ఖరీదు... సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకూ ఉంటున్నాయి.
- 2010 నుంచి ఇక్కడ సొంతిళ్లకు గిరాకీ బాగా పెరిగింది. దీంతో 2019 నాటికి ఫ్లాట్ల ధరలు ఏకంగా 187% మేర ఎగబాకాయి. 

- గంటకు రూ.360 (4.82 డాలర్లు) కనీస సంపాదన ఉండే నగరంలో సగటు ఇంటి ఖరీదు రూ.9.66 కోట్లు (1.3 మిలియన్‌ డాలర్లు).
- ఆ లెక్కన అత్యంత నిపుణుడైన ఉద్యోగి 650 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇంటిని సొంతం చేసుకోవడానికి... కనీసం 21 సంవత్సరాలు పనిచేయాల్సిందేనని ఓ అధ్యయనం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని