Air Pollution:  వాయు కాలుష్యంతో ఊపిరి విలవిల

 రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఒక్క 2019లోనే మన 

Published : 16 Nov 2021 13:02 IST

 2019లో మన దేశంలో 9.07 లక్షల మంది మృతి

 బొగ్గు ఉద్గారాల వల్ల మరణాలు 1.57 లక్షలు

 లాన్సెట్‌ గ్లోబల్‌ కౌంట్‌డౌన్‌ నివేదిక వెల్లడి

ఈనాడు, దిల్లీ: రోజు రోజుకీ పెరుగుతున్న వాయు కాలుష్యం లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఒక్క 2019లోనే మన దేశంలో 9,07,000 మంది దీని కారణంగానే మృతి చెందినట్లు సోమవారం విడుదలైన గ్లోబల్‌ లాన్సెట్‌ కౌంట్‌డౌన్‌ రిపోర్ట్‌-2021 పేర్కొంది. ‘వాతావరణ మార్పు-ప్రపంచ ఆరోగ్య భద్రతకు ముప్పు’ పేరుతో లాన్సెట్, ఐసీఎంఆర్, ఎన్‌ఐఐఆర్‌ఎన్‌సీడీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంప్లిమెంటేషన్‌ రీసెర్చ్‌ ఆన్‌ నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించారు. 2015తో పోలిస్తే దేశంలో కాలుష్యకారక మరణాలు 2019 నాటికి 8% పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ‘‘బొగ్గు ఉద్గారాల వల్లే దాదాపు 1.57 లక్షల మంది చనిపోయారు. ఇందులో థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్లతో పాటు పరిశ్రమలు, ఇళ్లలో వినియోగించే బొగ్గు ద్వారా వెలువడే కాలుష్యం కూడా ఉంది. సూక్ష్మధూళి రేణువులు వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. పీఎం 2.5, అంతకంటే తక్కువ స్థాయిలో ఉండే రేణువులు ఊపిరితిత్తులను దాటుకొని రక్తంలోకి ప్రవేశిస్తున్నాయి. నిర్మాణ పనులు, కూల్చివేతలు, మైనింగ్‌ కార్యకలాపాలు, వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్తు కేంద్రాల్లో శిలాజ ఇంధనం మండించడం, డీజిల్, పెట్రోల్‌ వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. దీర్ఘకాలం ఈ కాలుష్యంలో ఉంటే పిల్లల్లో ఆస్తమా, పెద్దల్లో ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. పెద్దల్లో క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజెస్‌ (సీఓపీడీ)ముప్పు పెరిగి గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, ఊపిరితిత్తుల కేన్సర్లతో మరణం సంభవించే ప్రమాదం ఉంది. పుట్టబోయే పిల్లలపైనా ప్రభావం పడుతుంది’’ అని నివేదిక వెల్లడించింది.

నివేదిక సూచించిన నివారణ చర్యలివి

- థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్‌ ఆక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, ధూళిరేణువుల నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. దీని కోసం వెచ్చించే వ్యయాన్ని ఆర్థిక, సామాజిక, వైద్య కోణంలో చూడాలి.

- సాధ్యమైనంత త్వరగా విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు వినియోగాన్ని తగ్గించి సౌర, పవన, హైడ్రో ఇంధనంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి.

- పారిశ్రామిక, నిర్మాణ, వాహన కాలుష్యాన్ని మూలాల్లోనే తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. 

వ్యవసాయ రంగం నుంచి వచ్చే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల్లో 46% మేకలు, గొర్రెలు, ఇతర పశువుల నుంచే ఉంటున్నాయి. పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా వాటి నుంచి వెలువడే మిథేన్‌ను తగ్గించవచ్చు. మంచి మేత విధానాలు, వాటి ఎరువును సరైన విధానంలో నిర్వహించడం, అనుత్పాదక పశువులను తగ్గించడం వల్ల మిథేన్‌ ఉద్గారాలను కట్టడి చేయవచ్చు. 

- దేశంలో వైద్య సౌకర్యాలు, పరీక్షలు, నిఘా వ్యవస్థలను మెరుగుపరచాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు