ఆస్ట్రియాలో నాలుగో ఉద్ధృతి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రపంచంలో.. ప్రధానంగా ఐరోపాలోని పలు దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆస్ట్రియా, జర్మనీ, నార్వే 

Published : 20 Nov 2021 10:51 IST

ఐరోపా దేశాల్లో కొవిడ్‌ విజృంభణ

బెర్లిన్‌: ప్రపంచంలో.. ప్రధానంగా ఐరోపాలోని పలు దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ఆస్ట్రియా, జర్మనీ, నార్వే తదితర దేశాల్లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. ఆస్ట్రియాలో కరోనా నాలుగో ఉద్ధృతి (ఫోర్త్‌ వేవ్‌) తీవ్రంగా ఉండటంతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే సోమవారం నుంచి 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఆ దేశ ఛాన్సలర్‌ అలెగ్జాండర్‌ షాలెన్‌బర్గ్‌ శుక్రవారం ప్రకటించారు. మరిన్ని ఉద్ధృతులకు చోటివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. 10 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత కూడా కేసులు తగ్గకపోతే దీన్ని 20 రోజులకు పొడిగిస్తామన్నారు. తాజా పరిణామాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోవడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని ఆస్ట్రియా వైద్యులు స్వాగతించారు. 90 లక్షల జనాభా ఉన్న ఆస్ట్రియాలో గత వారం రోజులుగా 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధ, గురు వారాల్లో దాదాపు 15 వేల చొప్పున కేసులు బయటపడ్డాయి. ఈ దేశంలో 65.7% మంది పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

జర్మనీలో ‘అత్యవసర పరిస్థితి’.. 

ఆస్టియ్రా పొరుగు దేశమైన జర్మనీలోనూ కొవిడ్‌ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. రోజుకు 50 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. జర్మనీలో పరిస్థితి ‘అత్యవసర’ స్థాయికి చేరుకుందని ఆ దేశ వ్యాధుల నియంత్రణ సంస్థ అధిపతి లోతర్‌ వీలెర్‌ పేర్కొన్నారు. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయని, ఇకపై సాధారణ వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. మహమ్మారిని అదుపు చేసేందుకు అత్యవసర చర్యలు అవసరమని స్పష్టం చేశారు. 

కొవిడ్‌ కట్టడికి పార్లమెంటు కొత్త నిబంధనల అమలుకు ఆమోదించింది. దీంతో ఇకపై బహిరంగ ప్రదేశాల్లో తిరగాలన్నా, ప్రజారవాణాను వినియోగించుకోవాలన్నా వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు ధ్రువపత్రం చూపించాలి. టీకా తీసుకోని పక్షంలో కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. జర్మనీలో వరుసగా ముడో రోజు కూడా 1,200 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. 

నార్వేలోనూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. విదేశాల నుంచి ఎవరైనా నార్వేలోకి రావాలంటే 3 రోజులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు అనుమతి లభించినవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. అలాగే కరచాలనాలు చేయవద్దని ప్రభుత్వం సూచించింది.

శ్రీలంకలో డెల్టా కొత్త ఉప రకం

కొలంబో: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న కొవిడ్‌ డెల్టా వేరియంట్‌ (బీ.1.617.2)కు సంబంధించిన కొత్త ఉపరకాన్ని శ్రీలంకలో కనుగొన్నారు. శాస్త్రీయంగా ‘బీ.1.617.2.ఏవై 104’గా పిలిచే ఈ రకం శ్రీలంకలో కరోనా వైరస్‌ మూడో ఉత్పరివర్తనగా చెబుతున్నారు. శ్రీజయవర్ధనేపుర విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్న ఈ ఉప రకానికి సంబంధించిన శాంపిళ్లను తదుపరి విశ్లేషణ కోసం హాంకాంగ్‌లోని ల్యాబ్‌లకు పంపించారు. ‘‘తొలుత కరోనా వైరస్‌ (సార్స్‌-కోవ్‌-2) వేరియంట్‌ బీ.411 బయటపడింది. తర్వాత బీ.1.617.2.ఏవై28ని కనుగొన్నాం. తాజా రకం మూడోది’’ అని విశ్వవిద్యాలయం మాలిక్యులర్‌ అండ్‌ సెల్‌ బయాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ చండిమా జీవదర తెలిపారు. శ్రీలంకలోని ఉత్తర, ఉత్తర-మధ్య, దక్షిణ ప్రావిన్సుల్లో ఈ రకం బయటపడినట్లు చెప్పారు. వైరస్‌ వేర్వేరు విధాలుగా.. ఒక్కోచోట ఒక్కోలా ఉత్పరివర్తనలకు లోనవుతున్నట్లు తెలుస్తోందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని