Education Standards: భారత్‌లో మెరుగుపడిన విద్యా ప్రమాణాలు

భారత్‌లో విద్యా ప్రమాణాలు, నాణ్యత గతంలో కన్నా ఇప్పుడు ఎంతో మెరుగైందని ఓ సర్వేలో తేలింది.

Published : 21 Nov 2021 12:20 IST

యునిసెఫ్‌ సర్వేలో వెల్లడి

దిల్లీ: భారత్‌లో విద్యా ప్రమాణాలు, నాణ్యత గతంలో కన్నా ఇప్పుడు ఎంతో మెరుగైందని ఓ సర్వేలో తేలింది. ఇందులో పాలుపంచుకున్న యువజనులలో 73 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి బాలల సంక్షేమ నిధి (యునిసెఫ్‌), గ్యాలప్‌ సంస్థలు సంయుక్తంగా భారత్‌ సహా 21 దేశాల్లో ఈ సర్వే జరిపాయి. బాల్యం రూపాంతరీకరణ ప్రాజెక్టు కింద జరిపిన ఈ అధ్యయన ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. దీని ప్రకారం.. భారత్‌లో 15-24 ఏళ్ల వయోవర్గంలో 73 శాతం మంది విద్యా నాణ్యత మెరుగుపడిందని భావిస్తుండగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్నారు. 40 ఏళ్లుపైబడిన వారిలో ఈ దృక్పథాన్ని వెలిబుచ్చినవారు 45 శాతం మంది మాత్రమే. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదండ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని భావించారు. పిల్లలు వారి తల్లిదండ్రులకన్నా మెరుగైన ఆర్థిక స్థితిని అందుకొంటారని 71 శాతం పెద్ద వయసువారు భావిస్తే, యువజనుల్లో 66 శాతంమందికే ఆ అభిప్రాయం ఉంది. యునిసెఫ్, గ్యాలప్‌ సంస్థలు ఈ ఏడాది మొదట్లో 21 దేశాల్లో 15-24 ఏళ్ల వయోవర్గంలోనూ, 40 ఏళ్లు అంతకుపైబడిన వయోవర్గంలోనూ మొత్తం 21,000 మంది అభిప్రాయాలను సేకరించాయి. వీరిలో 1500 మంది భారతదేశానికి చెందినవారు.

బాలికల విద్యపై ప్రభావం

ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న భారత్‌లో యువతరం విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షదాయకమని యునిసెఫ్‌ భారత ప్రతినిధి యసుమాస కిమురా పేర్కొన్నారు. కొవిడ్‌ వల్ల విద్యా సంస్థలు మూతపడటం బాలికలపై ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపింది. బాలికలు ఇంటి పనులకు పరిమితమవడం, బాల్య వివాహాలు వంటి అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తున్నాయి. బాలికలు మళ్లీ పాఠశాలలకు వెళ్లే వాతావరణాన్ని ప్రోత్సహించాలని కిమురా అభిప్రాయపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని