
South Africa: మా విమానాలను నిషేధిస్తారా!
మమ్మల్ని ‘విలన్లు’గా చూస్తే ఎలా?
వివిధ దేశాలపై దక్షిణాఫ్రికా మండిపాటు
జోహెన్నెస్‌బర్గ్: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో.. తమ దేశం నుంచి ప్రయాణాలపై 18 దేశాలు నిషేధం విధించడాన్ని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ (సామా) తప్పుపట్టింది. ఈ చర్యను ‘అనాలోచిత ప్రతిస్పందన’ అంటూ మండిపడింది. ప్రపంచం కీలకమైన వైద్య సమాచారాన్ని ‘పారదర్శకం’గా తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి విధానాలను మానుకోవాలని సూచించింది.
ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలోనే బయటపడటంతో పాటు, దీన్ని ‘ఆందోళనకర రకం (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి విమానాల రాకపోకలపై వివిధ దేశాలు నిషేధం విధించాయి. దీనిపై సామా ఛైర్పర్సన్ ఏంజెలిక్ కోయెట్జీ స్పందిస్తూ ఓ టీవీ ఛానెల్‌తో ఆదివారం మాట్లాడారు. కొత్త వేరియంట్ నుంచి ముప్పు ఏస్థాయిలో ఉందన్న విషయమై ఇంతవరకు తగినంత సమాచారమేదీ లేకుండానే 18 దేశాలు నిషేధం విధించాయని.. ఈ రకాన్ని కనుగొన్న తమను ‘విలన్లు’గా చూడటం సరికాదని, ఇంతకు ముందెప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రకటించినందుకు తమ దేశాన్ని ప్రశంసించాలి తప్ప.. ఇలా వ్యవహరించరాదని అన్నారు.
‘‘మా శాస్త్రవేత్తలు అత్యంత అప్రమత్తంగా ఉండటంతో పాటు విస్తృతంగా జన్యుక్రమ పరిశీలన జరపడంతోనే ఇది బయటపడి ఉండొచ్చు. ఐరోపా దేశాలు దీన్ని గుర్తించలేకపోవచ్చు. ఒమిక్రాన్ లక్షణాలు డెల్టా వేరియంట్ మాదిరిగా కాకుండా.. బీటా రకంలా ఉన్నాయి. ఒక్కసారిగా యువతలో.. ప్రత్యేకించి పురుషుల్లో తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు సమస్యలు వంటి కొత్త లక్షణాలను గుర్తించడంతో వారికి పరీక్షలు జరపగా పాజిటివ్‌గా తేలింది. ఈ లక్షణాలేవీ డెల్టా రకంతో సరిపోలక పోవడంతో వెంటనే కొవిడ్ సలహా మండలిని అప్రమత్తం చేశాం’’ అని వివరించారు. ఏ దేశమైనా తమ ప్రజలను కాపాడుకోవాలంటే వారిని అప్రమత్తం చేయాలి.. ఏం జరుగుతోందో తెలుసుకోవాలి తప్ప ఇలాంటి అనాలోచిత ప్రతిస్పందన సరికాదన్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో అధికంగా ఉత్పరివర్తనాలుండటం వల్లే ఇది ప్రమాదకరమని భావిస్తున్నామని, ఎంత ఆందోళనకరమన్న విషయమై ఇంకా శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నారని కోయెట్జీ గుర్తు చేశారు.