రష్యాతో బలపడనున్న రక్షణ బంధం 

ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య వచ్చే నెల 6న జరిగే శిఖరాగ్ర సమావేశంలో కీలక రక్షణ

Published : 30 Nov 2021 12:50 IST

 మోదీ-పుతిన్‌ భేటీలో కుదరనున్న కీలక ఒప్పందాలు

 

ఈనాడు, దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ల మధ్య వచ్చే నెల 6న జరిగే శిఖరాగ్ర సమావేశంలో కీలక రక్షణ ఒప్పందాలు కుదరనున్నాయి. అవి వ్యూహాత్మకంగానూ ఎంతో ముఖ్యమైనవి. మోదీ-పుతిన్‌ చివరిసారిగా 2019 సెప్టెంబరులో రష్యాలోని వ్లాడివోస్తోక్‌లో ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం కొవిడ్‌ మహమ్మారి కారణంగా వర్చువల్‌ సమావేశాలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. తిరిగి రెండేళ్ల తర్వాత వారు ఇప్పుడు దిల్లీలో ప్రత్యక్షంగా కలుసుకోనున్నారు. రూ.5,124 కోట్లతో భారత్‌లో 6 లక్షల కలష్నికోవ్‌ ఏకే-203 రైఫిళ్ల తయారీకీ, స్వల్ప దూరంలోని శత్రు లక్ష్యాల నాశనం కోసం రష్యా నుంచి రూ.11,262 కోట్లతో గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకూ వీరి భేటీలో ఒప్పందాలు కుదరనున్నాయి. కనుచూపుమేరలోని శత్రు విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను కూల్చివేయడానికి ఉపకరించే ఇగ్లా-ఎస్‌ విమాన విధ్వంసక క్షిపణులనూ రష్యా నుంచి మన దేశం సమీకరించనుంది.

ఇగ్లా-ఎస్‌ క్షిపణిని భుజం మీద నుంచి ప్రయోగించవచ్చు. భారత్, రష్యా సైనిక దళాలు మరింత తరచుగా, ఉన్నత స్థాయిలో సంయుక్త విన్యాసాలు జరిపే విషయంలోనూ తాజా భేటీలో అంగీకారం కుదరనుంది. రష్యా నుంచి రూ.40 వేల కోట్లతో భారత్‌ కొనుగోలు చేసిన ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థల బట్వాడా ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సమావేశం మార్గం సుగమం చేస్తుంది. రష్యా నుంచి ఎస్‌-400 కొనుగోలును అమెరికా వ్యతిరేకిస్తున్నా, ఈ విషయంలో భారత్‌పై ఇంతవరకు ఆంక్షలు విధించలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని