PLA: అజేయ శక్తిగా చైనా సైన్యం.. మిలిటరీలోకి కొత్తగా 3 లక్షల మంది

భవిష్యత్తులో జరిగే ఏ యుద్ధంలోనైనాసరే గెలిచే విధంగా చైనా సాయుధ దళాలను ఆధునికీకరించాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ యోచిస్తున్నారు.

Published : 30 Nov 2021 12:50 IST

బీజింగ్‌: భవిష్యత్తులో జరిగే ఏ యుద్ధంలోనైనాసరే గెలిచే విధంగా చైనా సాయుధ దళాలను ఆధునికీకరించాలని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ యోచిస్తున్నారు. ఇందుకోసం కొత్తగా 3 లక్షల మంది ప్రతిభావంతులైన యువతను సైన్యంలో చేర్చుకోవాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగిన ఓ సదస్సులో జిన్‌పింగ్‌ ప్రసంగిస్తూ.. చైనా సైనిక సిబ్బందికి ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాలను అలవరచడానికి ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. సత్వరమే అత్యుత్తమ సైనిక శిక్షణ కేంద్రాలను నెలకొల్పి, మేటి యోధులను తయారుచేసుకోవాలని సూచించారు. చైనా ప్రజా విమోచన సైన్యం (పీఎల్‌ఏ) ఏర్పడి 2027 నాటికి నూరేళ్లవుతుంది. శతజయంత్యుత్సవాలు జరిగే నాటికి చైనా సైన్య ఆధునికీకరణను పూర్తిచేసి.. 2050 కల్లా అమెరికాకు సైనికంగా సమవుజ్జీ కావాలని జిన్‌పింగ్‌ యోచిస్తున్నారు. తదనుగుణంగా 20,900 కోట్ల డాలర్ల వార్షిక బడ్జెట్‌తో చైనా సైన్యం ఆధునిక పోరు దళంగా రూపాంతరం చెందుతోంది. సంస్థాగత సంస్కరణలు చేపడుతూ హైపర్‌ సోనిక్‌ క్షిపణుల వంటి శక్తిమంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. 1950లలో కొరియా యుద్ధ సమయంలో చైనా సైన్యంలో 60 లక్షల సిబ్బంది ఉండేవారు.

2012లో జిన్‌పింగ్‌ అధికారం చేపట్టిన తరవాత పలు సంస్కరణలు తీసుకొచ్చి సైన్యం సంఖ్యాబలాన్ని 23 లక్షలకు తగ్గించారు. వారిలో 3 లక్షల మంది సిబ్బందికి ఇటీవలి సంవత్సరాలలో ఉద్వాసన పలికారు. ఉద్వాసనకు గురైనవారు.. రాజకీయ, బట్వాడా, ఆయుధ సరఫరా విభాగాలకు చెందిన నిర్వహణ సిబ్బందే తప్ప, పోరు విధుల్లోని సైనికులు కారు. ఇప్పుడు వీరికి బదులు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతను యుద్ధ నిర్వహణ విధుల్లో నియమించాలనుకుంటున్నారు. ఆధునిక యుద్ధాల్లో కంప్యూటర్లు, రోబోలు, ఉపగ్రహాలు, నెట్‌వర్క్‌లు, కృత్రిమ మేధ కీలకం కానున్నాయి. వీటి నిర్వహణకు ప్రతిభావంతులైన యువతను సైన్యంలోకి తీసుకోవాలన్నది జిన్‌పింగ్‌ ప్రణాళిక. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని