Afghanistan: క్షమించామంటూనే.. చంపేస్తున్నారు!

అఫ్గానిస్థాన్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లు పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. .

Published : 01 Dec 2021 09:11 IST

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రతీకార హత్యలు
హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ సంస్థ నివేదిక వెల్లడి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తాలిబన్లు పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు, నిఘా విభాగాల్లో పనిచేసిన అధికారులను కిడ్నాప్‌ చేయడంతో పాటు వేటాడి, వెంటాడి హత్యచేస్తున్నారని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. నాలుగు ప్రావిన్సుల్లో వంద మందికి పైగా కనిపించకుండాపోవడం లేదా హత్యకు గురికావడం జరిగిందని తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులందరినీ క్షమించామని తాలిబన్లు ప్రకటించినప్పటికీ ఈ దారుణాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మాజీ అధికారులు ప్రాణ భద్రతకు హామీ పత్రాలు పొందారు. ఆయా రికార్డుల్లోని పేర్లు, చిరునామాల ఆధారంగా వారిని తాలిబన్లు వెంటాడుతున్నారని ఆ సంస్థ పేర్కొంది. ‘మాజీ ఉద్యోగులందరినీ భయకంపితులను చేసేలా దారుణాలు జరుగుతున్నాయ’ని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తన నివేదికలో తెలిపింది. మాజీ ఉద్యోగులు, మాజీ సైనికులకు క్షమాభిక్షను ప్రసాదించామని, వాళ్లిక భయపడాల్సిన అవసరంలేదని తాలిబన్‌ నాయకత్వం పదే పదే ప్రకటిస్తున్నా దాడులు ఆగడంలేదు. ఆగస్టు 15వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు నాలుగు ప్రావిన్సుల్లో 47 మంది మాజీ సైనికులు, మరో 53 మంది ఇతరులు హత్యకు, అపహరణలకు గురైనట్లు హక్కుల సంస్థ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని