శస్త్రచికిత్సలు విఫలం..  25 మంది చూపు కోల్పోయే ప్రమాదం!

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పలువురు కంటి చూపు కోల్పోయారు...

Updated : 01 Dec 2021 11:33 IST

ముజఫర్‌పుర్‌: బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల పలువురు కంటి చూపు కోల్పోయారు. బాధితులకు నిర్వహించిన కేటరాక్ట్‌ ఆపరేషన్‌ విఫలమైందని అధికారులు తెలిపారు. ఆపరేషన్‌ తర్వాత కంట్లో మంట, నొప్పిగా ఉందని బాధితులు వాపోయినా.. వైద్యులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పటికే నలుగురు కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వారంతా కంటి మార్పిడి చికిత్సలు చేయించుకున్నారు. మరికొందరు బాధితులకు సైతం ఈ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన గత్యంతరం ఏర్పడింది. మొత్తం 25 మందికి ఈ చికిత్స జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని జురాన్‌ ఛాప్రా ప్రాంతంలో ఈ కంటి ఆస్పత్రి ఉంది. నవంబరు 22న ఆస్పత్రిలో కేటరాక్ట్‌ ఆపరేషన్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సమయంలోనే పదుల సంఖ్యలో బాధితులు చికిత్స చేయించుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కంటి చూపు పోయే ప్రమాదం తలెత్తిందని బాధితులు వాపోతున్నారు. దీనిపై సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ వినయ్‌కుమార్‌ శర్మకు సమాచారం అందించారు. బాధితులను ఇతర ఆస్పత్రులకు తరలించామని.. ఘటనపై  విచారణకు ఆదేశించామని వినయ్‌కుమార్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని