
Booster Dose: బూస్టర్ డోస్‌పై స్పష్టత ఇవ్వండి
అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించండి..
లోక్‌సభలో విపక్ష సభ్యుల డిమాండ్
దిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. రెండో విడత ఉద్ధృతి సమయంలో ఎదురైన చేదు అనుభవాలతోనైనా ఒమిక్రాన్‌ను సకాలంలో కట్టడి చేసేందుకు కదలాలని సూచించారు. టీకా బూస్టర్ డోస్‌పై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వారికి మూడో డోసు ఇవ్వడంపై ప్రభుత్వం విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 86 రోజుల నుంచి తగ్గించాలని సూచించారు. దేశంలో కరోనా కట్టడి చర్యలపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఒమిక్రాన్ రకం వైరస్ వ్యాపిస్తున్నందున దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాలను నిషేధించాలని కోరారు. రెండో విడత వైరస్ ఉద్ధృతిలో లక్షల మంది మృతికి బాధ్యత వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలన్నారు. విపక్ష సభ్యుల విమర్శలను భాజపా ఎంపీలు తిప్పికొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎన్నో చర్యలను దేశం విజయవంతంగా చేపట్టిందని పేర్కొన్నారు. వ్యాక్సిన్లు, వైద్యపరికరాలు, ఔషధాలు, పీపీఈ కిట్ల తయారీలో దేశం స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. కొవిడ్ కట్టడిపై చర్చ గురువారం రాత్రి వరకూ కొనసాగింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుక్రవారం సభలో సమాధానం ఇవ్వనున్నారు.