Omicron: అమెరికా, బ్రిటన్‌ వెళ్లాలంటే పరీక్షే

కరోనాలో కొత్త రకమైన ఒమిక్రాన్‌.. వివిధ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి.

Updated : 06 Dec 2021 13:08 IST

 కరోనా నివేదికలు తప్పనిసరి

వాషింగ్టన్, బ్రిటన్‌: కరోనాలో కొత్త రకమైన ఒమిక్రాన్‌.. వివిధ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులపై మళ్లీ ఆంక్షలు మొదలవుతున్నాయి. భారత్‌ సహా ఎక్కడి నుంచి తమ దేశానికి వచ్చినవారైనా ‘కొవిడ్‌-19 నెగెటివ్‌’ నివేదికను తప్పనిసరిగా కలిగి ఉండాలని అమెరికా తాజాగా ప్రకటించింది. సవరించిన ఉత్తర్వులు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. రెండేళ్లు, అంతకు మించిన వయసున్న విమాన ప్రయాణికులందరికీ ఇది వర్తిస్తుందని భారత ప్రభుత్వ అధికారులు భారతీయ అమెరికన్‌ ప్రతినిధులకు తెలిపారు. ప్రయాణానికి ఒకరోజు లోపు చేయించుకున్న కొవిడ్‌-19 పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు ప్రయాణికులు ఆధారం చూపాల్సి ఉంటుంది. లేదంటే గత 90 రోజుల్లో కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నట్లు పత్రాలు సమర్పించాలి.

మరిన్ని చోట్ల కేసులు 

న్యూయార్క్‌లో శనివారం మూడు కొత్త కేసులు బయటపడడంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసులు ఎనిమిదికి చేరాయి. వీటిలో ఏడు కేసులు న్యూయార్క్‌కి సంబంధించినవే. ఊహించిన రీతిలోనే ఈ రకం వైరస్‌.. ప్రజలకు వ్యాపించడం మొదలైందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. మసాచుసెట్స్, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లోనూ తొలిసారిగా కేసులు వెలుగుచూశాయి. మిన్నెసోటా, కొలరాడో, హవాయీ, కాలిఫోర్నియా తదితర చోట్ల కూడా ఒమిక్రాన్‌ బయటపడింది. డెల్టా రకం వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. అత్యవసరం కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆసుపత్రులను ఆదేశిస్తున్నారు. 

బ్రిటన్‌లో పరీక్షలు అనివార్యం 

బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులంతా ముందుగా కరోనా పరీక్షలు చేయించుకోవడాన్ని మరోసారి తప్పనిసరి చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. వ్యాక్సిన్లు తీసుకున్నవారికి, 12 ఏళ్లు పైబడిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రయాణానికి 48 గంటల్లోగా పరీక్ష చేయించుకుని ఉండాలి. కొత్త రకం రాకతో మరింతగా అదనపు చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రయాణికులు బ్రిటన్‌కు వచ్చాక రెండ్రోజుల్లోపు నెగెటివ్‌ ఫలితం సాధించేవరకు స్వీయ ఏకాంతంలోకి వెళ్తే సరిపోయేది. తాజా మార్పు ప్రకారం కరోనా నెగెటివ్‌ అనే రుజువు చూపనివారిని విమానాల్లోకి అనుమతించబోరు. నిషేధం అమల్లో ఉండే దేశాల జాబితాలో తాజాగా నైజీరియాను చేర్చారు. ఈ దేశం నుంచి బ్రిటన్‌కు వెళ్లేవారు 10 రోజుల పాటు హోటల్లో ఏకాంతంలో ఉండాల్సిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని