Omicron: సాధారణ పరిస్థితులు మళ్లీ వస్తాయా?

కరోనా కల్లోలం రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో కొత్త కలవరం మొదలైంది. 

Updated : 06 Dec 2021 11:58 IST

ధీమాగా సమాధానం చెప్పలేకపోతున్న జనం
బ్రిటన్‌ సర్వేలో వెల్లడి

లండన్‌: కరోనా కల్లోలం రెండేళ్లుగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో కొత్త కలవరం మొదలైంది. ఎప్పటికప్పుడు వైరస్‌ కొత్త రూపాలు పుట్టుకొస్తూ ఉంటే.. ఈ మహమ్మారి అంతమై.. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయి? అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే పనిలో ఉన్న బ్రిటన్‌లోని ఆఫీస్‌ ఫర్‌ నేషనల్‌ స్టాటిస్టిక్స్‌(ఓఎన్‌ఎస్‌) ప్రజలకు తరచూ ప్రశ్నలు సంధిస్తూ వస్తోంది. వారిచ్చే సమాధానాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. 2020 మార్చిలో కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చింది. మార్చి 27న తొలిసారిగా సర్వే చేసి ‘సాధారణ పరిస్థితులు ఎప్పుడొస్తాయని అనుకుంటున్నారు?’ అని ఓఎన్‌ఎస్‌ అడిగింది. ఏడాదిలోనే అంతా మామూలుగా మారుతుందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. సాధారణ పరిస్థితులు అసలు రానేరావని అప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పలేదు. ఆ తరువాత 20 నెలల్లో 76 సార్లు ఓఎన్‌ఎస్‌ ఇదే ప్రశ్నపై సర్వేలు జరిపింది. దాదాపుగా వారానికి ఒక సర్వే చేసింది. మొదట్లో ఉన్న ఆశావహ దృక్పథం ప్రజల్లో కనిపించలేదు. ఆ రోజులు మళ్లీ రావని చెప్పడం ప్రారంభించారు. గత నెల 14న జరిగిన 77వ సర్వేలో మళ్లీ మొదటి రోజులు వస్తాయన్న నమ్మకం లేదని చెప్పే వారి సంఖ్య బాగా పెరిగింది. దాదాపు 31 శాతం మంది ఇదే అభిప్రాయం చెప్పారు. ఏడాదిలోగా సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పిన వారి సంఖ్య 35 శాతానికి తగ్గింది. మునుపటి పరిస్థితులు అసలు రానేరావని కచ్చితంగా చెప్పిన వారి సంఖ్య 14 శాతంగా నమోదయింది. కరోనా మహమ్మారి చాలా మంది వ్యక్తిగత ప్రవర్తనలను మార్చేసింది. కరోనా ప్రభావం అటు మానసికంగా, ఇటు భౌతికంగా కనిపిస్తోంది. కేసులు, మరణాలు, లాక్‌డౌన్లు, ఉపాధి...ఒక్కొక్కరు ఒక్కో విధంగా నష్టపోయారు. వీటిని తట్టుకొని నిలబడడంపైనే ‘సాధారణ పరిస్థితులు’ ఆధారపడి ఉంటాయి. 

ఇంతకూ ‘సాధారణం’ అంటే...

ఇంతకూ సాధారణ పరిస్థితులు అంటే నిర్వచనం ఏమిటీ అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చినా 2020 మార్చి నాటి పరిస్థితులు మళ్లీ రాబోవని చాలా మంది అభిప్రాయపడ్డారు. అప్పటికి ఉండే వాతావరణాన్ని ఆమోదించి దాన్నే సాధారణ పరిస్థితులుగా భావించి అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని