
Amit shah: మన సరిహద్దుల్ని, సైనికుల్ని ఎవరూ తాకలేరు
బీఎస్‌ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఈనాడు- జైపుర్, జైసల్మేర్: దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం దృఢంగా ఉందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా చెప్పారు. పుల్వామా, ఉరి ఉగ్రవాదుల దాడుల అనంతరం కఠిన నిర్ణయాలు తీసుకుని దేశ సరిహద్దుల్ని, సైనికుల్ని ఎవరూ తేలికగా తీసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. సరిహద్దు భద్రత దళం (బీఎస్‌ఎఫ్) 57 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం జైసల్మేర్‌లోని షహీద్ పూనమ్ సింగ్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రత అనేది జాతీయ భద్రతతో సమానమన్నారు. ఎక్కడైనా మన సరిహద్దుల్ని అతిక్రమించినా, జవాన్లపై దాడులకు పాల్పడినా.. దీటుగా స్పందిస్తున్నామన్నారు. శత్రువుల పీచమణిచేందుకు మన సైనికులు సరిహద్దులు దాటి జరిపిన మెరుపు దాడులు, సర్జికల్ స్ట్రైక్‌లను ప్రపంచమే మెచ్చుకుందని షా అన్నారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే సరిహద్దులు సురక్షితంగా ఉండాలని, ఈ విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్, ఇతర భద్రత దళాల సేవలు నిరుపమానమని కొనియాడారు. ఇటీవల తలెత్తిన డ్రోన్ దాడుల ముప్పుపై స్పందిస్తూ.. సైనికులు, సరిహద్దుల రక్షణకు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతితకను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ, డీఆర్‌డీవోలు సంయుక్తంగా దేశీయ పరిజ్ఞానంతో కౌంటర్ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని, త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, వారు సంతోషంగా ఉంటేనే భద్రతా సిబ్బందికి సహకారం బాగుంటుందని చెప్పారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, వారి కుటుంబసభ్యుల కోసం ఇటీవల తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ సీఏపీఎఫ్’ ఆరోగ్య పథకంలో 21 వేల ఆస్పత్రుల్లో చికిత్స అందుతోందని తెలిపారు. 1965లో బీఎస్‌ఎఫ్ ఏర్పాటైనప్పటినుంచి వ్యవస్థాపక దినోత్సవాన్ని తొలిసారిగా దిల్లీ వెలుపల నిర్వహించడం, అదీ పాక్ సరిహద్దులోని ఎడారి పట్టణంలో జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రభుత్వాలను మేం పడగొట్టం
అధికారంలో ఉన్న ప్రభుత్వాలను భాజపా ఎప్పుడూ పడగొట్టదని అమిత్ షా అన్నారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గతేడాది భాజపా ప్రయత్నించిందంటూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ చేస్తున్న ఆరోపణలపై షా ఆదివారం స్పందించారు. జైపుర్‌లో భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందోనన్న భయంతోనే వారి పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. భాజపా ఎప్పుడూ అలాంటి పనులు చేయదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని వారు భావిస్తున్నట్టయితే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావొచ్చన్నారు. 2023 ఎన్నికల్లో రాజస్థాన్‌లో 2/3 మెజారిటీతో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.