Akhilesh Yadav: అఖిలేశ్‌ రథంపై కలాం చిత్రం

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఉపయోగిస్తున్న

Updated : 06 Dec 2021 12:24 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఉపయోగిస్తున్న ఎన్నికల రథంపై మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం చిత్రం ఉండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకొంది. ఆయన ఉపయోగిస్తున్న ‘సమాజ్‌వాదీ విజయ్‌ యాత్ర రథ్‌’పై సర్దార్‌ పటేల్, సోషలిస్టు నాయకులు ఆచార్య నరేంద్ర దేవ్, రామ్‌మనోహర్‌ లోహియా, అంబేడ్కర్‌లతో పాటు కలాంల చిత్ర పటాలు ఉన్నాయి. దేశ ప్రముఖుల నుంచి సమాజ్‌వాదీ పార్టీ స్ఫూర్తి పొందుతోందని, అందుకే వారి చిత్రపటాలను ఉపయోగిస్తున్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. కలాంను రాష్ట్రపతి చేయాలని తొలుత ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రతిపాదించారని, దానిని గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ప్రముఖ ముస్లిం నాయకుడు అజాంఖాన్‌ వివిధ కేసుల కారణంగా ప్రస్తుతం జైలులో ఉండడంతో ఆ లోటును భర్తీ చేసి, ముస్లింలను ఆకర్షించడానికే కలాం ఫొటోను ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఆ నాయకులు ఖండిస్తున్నారు. కలాం శాస్త్రవేత్తే తప్ప రాజకీయ నాయకుడు కాదని గుర్తు చేస్తున్నారు. కలాంను కేవలం ముస్లింలకు పరిమితం చేయలేమని, ఆయన ప్రతి రోజూ వేదాలు చదివిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కలాం సేవలను ప్రజలకు గుర్తు చేసి, ఆయనపై ఉన్న గౌరవంతోనే ఫొటో పెట్టుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై భాజపా నాయకుల స్పందన మరోలా ఉంది. కలాంను రాష్ట్రపతి చేసింది వాజ్‌పేయేనని, అందువల్ల ఆయన ఫొటో కూడా పెట్టుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. భాజపా భావజాలానికే ఆదరణ ఉందని అఖిలేశ్‌ కూడా గుర్తించడం సంతోషకరమని అంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని