Published : 07/12/2021 11:57 IST

Supreme Court: సామాజిక మార్పుతోనే వరకట్న సమస్య దూరం: సుప్రీంకోర్టు వ్యాఖ్య 

దిల్లీ: వరకట్నం సామాజిక సమస్య అని, సంఘంలో మార్పు వస్తేనే ఇది పరిష్కారమవుతుందని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది. వరకట్నం సమస్య నిరోధానికి మూడు సూచనలు చేస్తూ కేరళకు చెందిన సబు సెబాస్టియన్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిష్కరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని లా కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్తామని, ఆ సంస్థకు ఈ విషయాలను నివేదించాలని తెలిపింది. ‘‘చట్టపరమైన సంస్కరణలు అవసరమే. కానీ మొదట సమాజంలో మార్పు రావాల్సి ఉంది. మహిళలను ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారిని కుటుంబంలోకి ఆహ్వానించాలి అన్నదానిపై చర్చలు జరగాలి. ఈ దురాచారం వివాహ వ్యవస్థపైనే ప్రభావం చూపుతోంది’’ అని తెలిపింది. సమాచార హక్కు అధికారులు ఉన్న మాదిరిగా వరకట్న నిరోధక అధికారులు ఉండాలని, వివాహ సమయంలో మహిళకు ఇచ్చిన నగలు కనీసం ఏడేళ్లు వారి వద్దే ఉండేలా చూడాలని, వివాహానికి ముందు కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి పాఠ్యాంశాలు ఉండాలని పిటిషన్‌దారు కోరారు. 

పరంబీర్‌పై దర్యాప్తు చేయొచ్చు

ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌పై దర్యాప్తు చేసుకోవచ్చని మహారాష్ట్ర పోలీసులకు సోమవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఎలాంటి అభియోగపత్రం దాఖలు చేయకూడదని సూచించింది. ఈ కేసును చేపట్టే విషయమై సమాధానం ఇవ్వాలని సీబీఐని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై విచారణకు సుముఖం

మహారాష్ట్ర స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై భాజపాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్‌ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించడానికి సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. డిసెంబరు 22-28 మధ్య అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్న దృష్ట్యా త్వరగా విచారించాలని వారి తరఫు న్యాయవాది సిద్దార్థ ధర్మాధికారి కోరారు. విచారణ జరిగే తేదీని ప్రకటిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

పీకే నియామకంపై వ్యాజ్యం కొట్టివేత

పంజాబ్‌ ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్‌ ఉన్నప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను సలహాదారుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేబినెట్‌ మంత్రి హోదాలో ముఖ్య సలహాదారుగా ఆయనను అమరీందర్‌ నియమించుకున్నారు. అయితే ఆ పదవికి ప్రశాంత కిశోరే రాజీనామా చేసినందున ఈ వ్యాజ్యం అవసరం లేదని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. 

బిల్డర్ల వినతిని శుక్రవారం చూస్తాం

 *దిల్లీ రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ పనులను నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తొలగించాలన్న వ్యాజ్యం అత్యవసర విచారణకు ఇదే ధర్మాసనం నిరాకరించింది. శుక్రవారం చూస్తామని తెలిపింది.

*ఎల్గార్‌ పరిషత్‌ కేసులో అరెస్టయిన సుధా భరద్వాజ్‌కు బాంబే హైకోర్టు డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ఐఏ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.


సామాన్యుల న్యాయమూర్తి శాంతనగౌడర్‌

స్మారక కార్యక్రమంలో సీజేఐ ఎన్‌.వి.రమణ నివాళి

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మోహన్‌ ఎం.శాంతనగౌడర్‌ దేశంలోని సగటు మనుషుల సంక్షేమం గురించి తపనపడే ఉదాత్తమైన వ్యక్తిత్వం గలవారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి న్యాయవ్యవస్థకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 24న శాంతనగౌడర్‌ గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రిలో మృతిచెందారు. సుప్రీంకోర్టులో సోమవారం నిర్వహించిన సంస్మరణ సభలో సీజేఐ ఎన్‌.వి.రమణ ప్రసంగిస్తూ.. ‘సన్నిహిత మిత్రుడు, విలువైన సహచరుడు జస్టిస్‌ శాంతనగౌడర్‌కు సంతాపం తెలిపే రోజు వస్తుందని ఊహించలేదు. ఆయన మృతితో దేశం సామాన్యుల న్యాయమూర్తిని కోల్పోయింద’ని తెలిపారు. న్యాయవిజ్ఞాన శాస్త్రానికి శాంతనగౌడర్‌ అందించిన సేవలు వివాదరహితమైనవన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తు, న్యాయవాదులతో పాటు అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ శాంతనగౌడర్‌కు నివాళులర్పించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని