మాదక ద్రవ్యాల నిరోధక చట్టంలో పొరపాటు సవరణకు బిల్లు

మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్‌డీపీఎస్‌) రూపకల్పనలో దొర్లిన ఓ పొరపాటును సరిచేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును

Published : 07 Dec 2021 11:20 IST

దిల్లీ: మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్‌డీపీఎస్‌) రూపకల్పనలో దొర్లిన ఓ పొరపాటును సరిచేసేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లును కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు నిధులు అందించే వ్యక్తులను శిక్షించేలా చట్టంలో నిబంధనను చేర్చేందుకు ఈ సవరణ బిల్లు అవసరమయ్యింది. ఈ ఏడాది సెప్టెంబరు 30న కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లును ప్రతిపాదించారు.

మేధో వలసను నివారించడమే కాదు.. ఎన్నారైలనూ దేశానికి రప్పిస్తాం: కేంద్రం

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో చదువుకుని విదేశాలకు వెళ్లిపోతున్న గ్రాడ్యుయేట్ల మేధో వలసను నివారించడంతో పాటు ప్రవాస భారతీయు(ఎన్నారై)లను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. మేధో వలస మూల కారణాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందా అనే ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రవాస భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు, మన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో  పరిశోధనలు చేపట్టేందుకు ప్రధాన మంత్రి ప్రకటించిన రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పథకం దోహదపడుతుందన్నారు. మద్రాస్, బాంబే, ఖరగ్‌పుర్, కాన్పుర్, దిల్లీ, గువాహటి, హైదరాబాద్‌ ఐఐటీల్లో, బెంగళూరులోని ఐఐఎస్సీలో రీసెర్చ్‌ పార్కులు నెలకొల్పేందుకు అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇంక్యుబేషన్‌ సెంటర్లు, అంకుర సంస్థలు ఔత్సాహికులకు మద్దతుగా నిలుస్తున్నాయని వివరించారు. భారత సంతతికి చెందిన వారితో పాటు విదేశీ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలనూ రప్పించే యత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఐఐటీలకు నేతల పేర్లు పెట్టే ప్రతిపాదన లేదు

దేశంలో ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీలకు అవి ఉన్న రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతల పేర్లను వాటికి పెట్టే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాస్‌ సర్కార్‌ లోక్‌సభకు తెలిపారు.

38 వేల పాఠశాలలు, 2.86 లక్షల అంగన్‌వాడీల్లో మరుగుదొడ్లు లేవు

దేశవ్యాప్తంగా 38,408 పాఠశాలలు, 2,86,310 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభకు తెలిపింది. ఎన్‌సీపీ ఎంపీ వందనా చవాన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఈ విషయాలు వెల్లడించారు. చేతులు శుభ్రం చేసుకొనే సదుపాయాలు లేని పాఠశాలలు 2,85,103 ఉన్నాయన్నారు. 6,50,481 పాఠశాలల తాగు నీటి అవసరాలను చేతిపంపులే తీర్చుతున్నాయని, మరో 61,627 పాఠశాలల్లోని విద్యార్థులు సురక్షితం కాని బావుల నీటిని వినియోగస్తున్నారని తెలిపారు. సురక్షితమై బావుల నీరు 82,708 పాఠశాలలకు అందుబాటులో ఉంది. 4,15,102 పాఠశాలలకు కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. తెలంగాణలోని 18,072, ఆంధ్రప్రదేశ్‌లోని 14,731 అంగన్‌వాడీ కేంద్రాలకు మరుగు దొడ్ల వసతి లేదని మంత్రి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని