Covid: ఐరోపాలో 5-14 ఏళ్ల పిల్లల్లో అధికంగా కొవిడ్‌

ఐరోపా ప్రాంతంలో ఇటీవల కొవిడ్‌ బారిన పడుతున్నవారిలో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ

Published : 08 Dec 2021 12:37 IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

జెనీవా: ఐరోపా ప్రాంతంలో ఇటీవల కొవిడ్‌ బారిన పడుతున్నవారిలో 5 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలు ఎక్కువ శాతం ఉంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) యూరప్‌ కార్యాలయం తెలిపింది. గత 2 నెలల్లో ఈ ప్రాంతంలో కరోనా కేసులు, మరణాలు రెట్టింపు అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఐరోపా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ హాన్స్‌ క్లుజ్‌ తెలిపారు. ఇప్పటికీ విస్తృత వ్యాప్తిలో ఉన్న డెల్టా రకంతోనే ముప్పు తలెత్తుతోందన్నారు. పిల్లలను, పాఠశాలలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆయా దేశాలను కోరారు. కొన్నిచోట్ల మిగిలినవారి కంటే పిల్లలో 2-3 రెట్లు కూడా ఎక్కువగా కొవిడ్‌ వ్యాప్తి చెందుతున్నట్లు చెప్పారు. పిల్లల్లో వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉన్నట్లు తెలిపారు. అయితే బడులకు పంపిస్తే వారి నుంచి ఇళ్లలో ఉండే తల్లిదండ్రులు, వయోధికులకు 10 రెట్లు ముప్పు ఉంటున్నట్లు చెప్పారు. ఇలాంటివారిలో ఎవరైనా టీకా తీసుకోకుంటే వ్యాధి తీవ్రస్థాయికి చేరడం, ప్రాణాపాయం వంటి ముప్పు పెరుగుతున్నట్లు తెలిపారు. ఈమేరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ తక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐరోపా, మధ్య ఆసియాల్లో డెల్టా వేరియంట్‌ ఇప్పటికీ ప్రబలంగా ఉన్నట్లు వెల్లడించారు. గత వారం డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని కేసుల్లో 70% ఐరోపాలోనే నమోదయ్యాయి.

432 ఒమిక్రాన్‌ కేసులు..
ఐరోపా ప్రాంతంలోని 21 దేశాల్లో 432 ఒమిక్రాన్‌ కేసులు బయటపడినట్లు డాక్టర్‌ హాన్స్‌ క్లుజ్‌ తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌ మరింతగా వ్యాప్తి చెందుతుందా? దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా? తక్కువగా ఉం టుందా? వంటి అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని