Updated : 09 Dec 2021 11:54 IST

Omicron: ఒమిక్రాన్‌ బాధితులకు ప్రత్యేక చికిత్సలు

రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారిన పడినవారికి కొవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రుల్లోనే చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బాధితులను ప్రత్యేకంగా ఐసొలేషన్‌ ప్రాంతాల్లో ఉంచాలని.. వారి నుంచి ఇతర రోగులకు గానీ, వైద్య సిబ్బందికి గానీ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఈమేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు బుధవారం లేఖ రాశారు. పలు అంశాలపై నిర్దిష్టమైన సూచనలు చేశారు. 

- పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యుక్రమ పరిశీలనకు గాను ఇన్సాకోగ్‌ ల్యాబ్‌లకు తప్పక పంపించాలి. 

- బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని (కాంటాక్ట్‌లను)  యుద్ధప్రాతిపదికన గుర్తించి ప్రొటోకాల్‌ ప్రకారం పరీక్షలు చేయించాలి. వారందరినీ తొలుత క్వారెంటైన్‌లో ఉంచాలి.

రాష్ట్రాల్లో తగినన్ని కొవిడ్‌ పరీక్షలు నిర్వహించకపోతే ఒమిక్రాన్‌ రకం వైరస్‌ వ్యాప్తిని గుర్తించడం కష్టం. అందువల్ల 5%కి మించి పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో రాష్ట్రాలు తగిన సంఖ్యలో పరీక్షలు చేపట్టాలి. 

- రాష్ట్రాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందర్నీ జిల్లా నిఘా బృందాలు పరిశీలిస్తూ ఉండాలి. 

- కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల క్లస్టర్లు, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఇన్‌ఫెక్షన్లు, రీ-ఇన్‌ఫెక్షన్‌ కేసులను కనిపెట్టడానికి ఎక్కువ నిఘా పెట్టాలి. ఇలాంటి వారి నుంచి సేకరించిన పాజిటివ్‌ నమూనాలన్నింటినీ ఇన్సాకోగ్‌ ల్యాబ్‌లకు పంపించాలి.

- హోం ఐసోలేషన్, క్వారంటైన్‌లో ఉన్న కాంటాక్ట్‌లతో మాట్లాడటానికి రాష్ట్రాలు ఈ-సంజీవని వేదికను, కాల్‌ సెంటర్లను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలను ఇళ్లకు పంపి జాగ్రత్తగా పరిశీలించాలి. 

- ప్రస్తుతం శీతాకాలంలో కొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం పెరిగినందున ఇన్‌ఫ్లుయాంజా తరహా సమస్యలు, అకస్మాత్తుగా శ్వాశకోస సంబంధ సమస్యలు ఎదుర్కొనే వారందర్నీ పరీక్షించాలి.

- సామాజిక చైతన్యం పెంచేలా.. తగినవిధంగా కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలి.

ఒమిక్రాన్‌ శ్రేణిలో మరో వైరస్‌ ఆస్ట్రేలియాలో వెలుగులోకి

సిడ్నీ: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వంశంలో మరో తాజా వైరస్‌ వెలుగుచూసింది. అయితే, స్క్రీనింగ్‌ పరీక్షలకు ఇది అంత సులభంగా చిక్కడం లేదు! దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు ఇటీవల వచ్చిన ఓ వ్యక్తిలో దీన్ని కనుగొన్నట్టు ఆ రాష్ట్ర ప్రధాన ఆరోగ్యాధికారి పీటర్‌ ఐకెన్‌ బుధవారం వెల్లడించారు. అసలు కరోనా వైరస్‌లోని సగం జన్యు వైవిధ్యాలు ఇందులో ఉన్నట్టు తెలిపారు. సదరు ప్రయాణికుడికి శనివారం కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా, పాజిటివ్‌ ఫలితం వచ్చింది. దీంతో అతడి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా కొత్త వైరస్‌ జాడ కనిపించింది. ‘‘కొత్తగా కనిపించిన వైరస్‌... ఒమిక్రాన్‌ మాదిరే ఉంది. రెండింటి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అందుకే వీటిని ఒకే వంశానికి చెందిన వైరస్‌లుగా పరిగణిస్తున్నాం’’ అని పీటర్‌ పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ తీరుతెన్నులు పరిశోధకుల అవగాహనకు ఇంకా పూర్తిగా రాకముందే... అదే కోవకు చెందిన మరో వైరస్‌ తలెత్తడంతో నిపుణులు విస్తుపోతున్నారు.

ఫైజర్‌ టీకాతో కొత్త వేరియంట్‌ నుంచి స్వల్ప రక్షణే!బూస్టర్‌ డోసుతో ముప్పు దూరం

జొహానెస్‌బర్గ్, న్యూయార్క్‌: కరోనా వైరస్‌ ఇతర వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్న ఫైజర్‌ టీకా... ఒమిక్రాన్‌ నుంచి మాత్రం పాక్షికంగానే రక్షణ కల్పిస్తోందని దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికా హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఈ మేరకు ప్రయోగశాలలో తాజాగా చేపట్టిన అధ్యయన ప్రాథమిక వివరాలను ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విలెమ్‌ హనెకోమ్‌ బుధవారం వెల్లడించారు. అయితే, బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఒమిక్రాన్‌ నుంచి మంచి రక్షణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ బారినపడి, రెండు డోసుల టీకా తీసుకున్నవారికి కూడా మహమ్మారి నుంచి సమర్థ రక్షణ లభిస్తున్నట్టు తెలిపారు.

‘యాంటీబాడీలను 25 రెట్లు పెంచుతుంది..’

ఫైజర్‌ సంస్థ కూడా.. తమ టీకా తొలి రెండు డోసులు ఒమిక్రాన్‌పై అంతగా ప్రభావం చూపకపోయినా, బూస్టర్‌ డోసు యాంటీబాడీలను 25 రెట్లు పెంచుతుందని తెలిపింది. ఇటీవల చేపట్టిన అధ్యయన ప్రాథమిక వివరాలను వెల్లడించింది. యాంటీబాడీస్‌ సంఖ్య ఆధారంగానే వైరస్‌ను ఓ టీకా ఏ మేరకు నిరోధిస్తుందన్న విషయాన్ని అంచనా వేస్తారు. తొలి రెండు డోసులు తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా కాపాడతాయని, మూడో డోసుతో ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుందని ఫైజర్‌ చెబుతోంది. ‘‘మూడో డోసుతో ఒమిక్రాన్‌పై రక్షణ మరింత గరిష్ఠమవుతుందని మా ప్రాథమిక డేటా చెబుతోంది’’ అని ఫైజర్‌ సీఈవో ఆల్బర్ట్‌ బోర్లా తెలిపారు.

8,439 కేసులు.. 195 మరణాలు..

దిల్లీ: దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య బుధవారం మళ్లీ పెరిగింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో (ఉదయం 8 గంటల వరకు) 8,439 కొత్త కేసులు బయటపడగా.. 195 మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 1,617 కేసులు పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 4,73,952 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,40,89,137 మంది కొవిడ్‌ను జయించారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని