helicopter crash: కొండల్లో ప్రమాదాలు ప్రాణాంతకమే..

తమిళనాడులోని అటవీప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతిచెందడం విషాదాన్ని నింపింది. 

Published : 09 Dec 2021 09:34 IST

పేలుడుతో మంటలు రేగే అవకాశం

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-కోయంబత్తూరు: తమిళనాడులోని అటవీప్రాంతంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మృతిచెందడం విషాదాన్ని నింపింది. గతంలోనూ హెలికాప్టర్లు కొండలు, వాటిపై ఉన్న చెట్లను ఢీకొన్నాయి. అలాంటి ఘటనల్లో ఏ ఒక్కరూ క్షేమంగా బయటపడలేదు. 

ముంబయి సమీపంలో..

1993 జులై 15న ముంబయి సమీపంలోని జెండా తెక్రీ హిల్‌టాప్‌లోని తలోజా గ్రామం దగ్గర హెలికాప్టర్‌ కొండను ఢీకొంది. అందులోని నలుగురూ మరణించారు. ఆ హెలికాప్టర్‌ అహ్మదాబాద్‌ నుంచి ముంబయికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 4 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఎయిర్‌ట్రాఫిక్‌ కమ్యూనికేషన్‌ తెగిపోయింది. తర్వాత అదుపుతప్పి కొండను ఢీకొంది. పైలట్‌ సమన్వయం చేసుకోలేకపోవడం, రాడార్‌ కంట్రోలర్‌ కూడా అప్రమత్తంగా లేకపోవడం లోపాలని విచారణ నివేదికలో పేర్కొన్నారు.  

వైఎస్‌ ప్రమాదం ఇలా..

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్‌ కర్నూలు జిల్లా ఆత్మకూరుకు 26 కి.మీ. దూరంలోని రుద్రకోడు కొండను ఢీకొంది. ఇద్దరు పైలట్లు, నాటి సీఎం వైఎస్‌ఆర్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలొదిలారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికే చెందిన వీటీ-ఏపీజీ హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి చిత్తూరు జిల్లాలో ‘రచ్చబండ’కు వెళ్తున్నప్పుడు 2009 సెప్టెంబరు 2న ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై విచారణ కమిటీ ఛైర్మన్‌ ఆర్‌కే త్యాగి 2010లో ఇచ్చిన నివేదిక ప్రకారం.. హెలికాప్టర్‌ నిర్దేశించిన మార్గాన్ని తప్పి ప్రయాణించిందని, దట్టంగా ఉన్న మేఘాల మధ్యనుంచి వెళ్లిందని తెలిపారు. ఆ సమయంలో సాంకేతిక లోపం సంభవించిందని.. చుట్టుపక్కల వాతావరణ పరిస్థితుల్ని అవగాహన చేసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని