
Britain: లాక్‌డౌన్ సమయంలో విందు, వినోదాలు.. బోరిస్ జాన్సన్ క్షమాపణ
లండన్: కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశమంతటా నిషేధాజ్ఞలు అమలు చేసిన బ్రిటన్‌లో ప్రధాని కార్యాలయ సిబ్బందే వాటిని ఉల్లంఘించి విందులు, వినోదాలు జరుపుకున్నారు! లాక్‌డౌన్‌ను పరిహసించేలా జోకులు వేసుకున్నారు. దేశ ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో వారు చేసిన ఈ నిర్వాకం ఏడాది తర్వాత వెలుగు చూసింది. ఆ వీడియో దృశ్యాలు లీకవడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆత్మరక్షణలో పడిపోయిన ప్రధాని బోరిస్ జాన్సన్ బుధవారం పార్లమెంటులో దేశ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. దానిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. 2020 డిసెంబరు 18న ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా విస్మరించి క్రిస్మస్ పార్టీ జరుపుకున్నారు. విందుతో పాటు ఆటలు, పాటలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేశారు.
ఆ సమయంలో ప్రజలు గుమిగూడడంపై దేశమంతటా కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయి. క్రిస్మస్ వేడుకలపైనా ఆంక్షలు విధించారు. వాటిని అతిక్రమిస్తే జరిమానాలు వేస్తామనే హెచ్చరికలూ జారీ అయ్యాయి. అటువంటి పరిస్థితుల్లోనే జరుపుకున్న విందు వినోదాల విషయాన్ని ప్రధాని కార్యాలయ సిబ్బంది నాలుగు రోజుల తర్వాత ఒక హాలులో మాట్లాడుకుంటూ గుర్తుచేసుకొని జోకులు వేసుకున్నారు. ప్రభుత్వ ప్రెస్ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్ పరిహాసపు మాటలు వీడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. మరో సహాయకుడు పాత్రికేయుడి మాదిరిగా నటిస్తూ.. క్రిస్మస్ పార్టీ గురించి ప్రశ్నిస్తూ కనిపించారు. ఈ వ్యవహారంపై విపక్ష లేబర్ పార్టీ నేత స్టార్మర్.. ప్రధాని జాన్సన్‌ను నిలదీశారు. బోరిస్ క్షమాపణలు చెప్పిన తర్వాత.. లీకైన వీడియోలో కనిపించిన ప్రెస్ సెక్రెటరీ అలెగ్రా స్రాటన్ తన పదవికి రాజీనామా చేశారు.