Helicopter: సురక్షిత ప్రయాణానికి సువర్ణ సూత్రాలు

 ఈ ఆధునిక కాలంలో లోహవిహంగాలు లేకుండా దేశ రక్షణని ఊహించలేం. బలగాలు, ఆయుధ, ఆహార సామగ్రి సరఫరాకే కాకుండా..

Updated : 23 Feb 2024 19:54 IST

 ప్రతి ఆపరేషనల్‌ బేస్‌క్యాంపులో నిత్యం మననం చేసుకునేలా ప్రదర్శన
 లోహవిహంగాలు నడపడంలో త్రివిధ దళాలు ఎంతో అప్రమత్తం 

ఈనాడు, హైదరాబాద్‌: ఈ ఆధునిక కాలంలో లోహవిహంగాలు లేకుండా దేశ రక్షణని ఊహించలేం. బలగాలు, ఆయుధ, ఆహార సామగ్రి సరఫరాకే కాకుండా.. గస్తీ, శత్రువులపై దాడి, ఎదురుదాడికి ఇవి ఎంతో అవసరం. విమానాలు, హెలికాప్టర్లు అనగానే సాధారణంగా వాయుసేన గుర్తుకువస్తుంది. కానీ సైన్యం, నౌకాదళం వద్ద కూడా వీటి సేవలు ఎంతో కీలకం. ఇందుకోసం ఆయా విభాగాలు ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాయి. ఇవి ఎంత అవసరమో.. ఏమాత్రం తేడా వచ్చినా అంతే ప్రమాదకరం కూడా. ముఖ్యంగా ఇవి గాల్లోకి ఎగిరేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయుధ బలగాల ‘ఆపరేషనల్‌ బేస్‌’లలో కొన్ని సిద్ధాంతాలు బోధిస్తారు. వాటిని నిత్యం మననం చేసుకునేలా ప్రత్యేకంగా రాయించి గోడలకు అతికిస్తారు. ‘సువర్ణ సూత్రాలు’ పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు ప్రమాదరహిత వాయు రవాణాకు ఎంతో కీలకం. 
అస్సాంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌బేస్‌లో కనిపించే నిబంధనలు ఇవీ..
1. భౌతికశాస్త్ర నిబంధనల ప్రకారం విహంగాలు ఎగురుతాయి
2. విహంగాలకు నీ అనుభవం, నైపుణ్యం, విద్యార్హతలు తెలియవు 
3. అద్భుతమైన నైపుణ్యం, నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యాన్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కాకుండా.. ప్రమాదంబారిన పడకుండా ఉండేందుకు ఉపయోగించుకోవాలి
4. వాతావరణాన్ని, భౌగోళిక పరిస్థితులను గౌరవించాలి
5. ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ), ఆదేశాలు, మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి 
6. సమగ్ర సమీక్ష, పునఃసమీక్ష లేకుండా విహంగంతో ఎగిరేందుకు ప్రయత్నించవద్దు
7. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలనుకోవడం, ఆత్మసంతృప్తి లేదా అనవసర ప్రయత్నం చేయాలనుకునే ఆలోచనకే తావివ్వొద్దు
8. అనుమానం ఉంటే ముందుకెళ్లడం కంటే ఆగిపోవడం ఉత్తమం 
9. ‘మూడు ఆర్‌’ల సూత్రం గుర్తుంచుకోవాలి. అవి సరైన వ్యక్తి (రైట్‌ పర్సన్‌), సరైన పరికరాలు (రైట్‌ ఎక్విప్‌మెంట్‌), సరైన విధానం (రైట్‌ ప్రొసీజర్‌)
10. వారసత్వంగా వస్తున్న విహంగాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని