Published : 10 Dec 2021 10:39 IST

Helicopter Crash: ఈ లోహవిహంగానికి గండాలెన్నో..!

 హెలికాప్టర్లకు అడుగడుగునా ప్రమాదాలే

అనూహ్య వాతావరణమే అసలు శత్రువు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా హెలికాప్టర్‌ ప్రయాణానికి వాతావరణమే అసలు శత్రువుగా భావిస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోకుండా వాతావరణంలో సంభవించే మార్పులు ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుంటాయి. విమానాలతో పోల్చుకుంటే హెలికాప్టర్లకే సవాళ్లు ఎక్కువ. విమానాలు దిగడానికి, ఎగరడానికి ప్రత్యేకమైన విమానాశ్రయాలు ఉంటాయి. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితిని కచ్చితంగా అంచనా వేయవచ్చు. అలాగే అవి మేఘాలపైన కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. అందువల్ల వీటి ప్రయాణం చాలావరకూ సురక్షితం. హెలికాప్టర్ల పరిస్థితి అలా కాదు. ఎక్కడెక్కడో కొండలు, లోయల్లో హెలిపాడ్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడున్న వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు యంత్రాంగం ఏమీ ఉండదు. హెలికాప్టర్‌ ప్రయాణానికి ముందే వాతావరణ నివేదిక తెప్పిస్తారు. అది గాల్లోకి ఎగిరిన దగ్గర నుంచి ప్రయాణ మార్గం, మళ్లీ దిగే దగ్గర ఉన్న గాలి వేగం, మబ్బులు, మంచు, వర్షం వంటి వాటన్నింటినీ మదింపు చేస్తారు. వాతావరణం ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా.. అంటే బలమైన గాలులు, మేఘాలు, మంచు, వర్షం వంటివి ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వరు. ఇందుకోసమే ప్రత్యేకంగా స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) పాటిస్తుంటారు. దీని ప్రకారమే అనుమతులు ఇస్తుంటారు. 

విమానాలకైతే ఏటీసీ.. 

విమానాల ప్రయాణం అంతా నావిగేషన్‌ ప్రకారం ఉంటుంది. అంటే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో (ఏటీసీ) ఉన్న నిపుణులు తమ వద్ద ఉన్న రాడార్‌ ద్వారా విమాన గమనాన్ని, ఎత్తును నిర్దేశించవచ్చు. ఏమైనా తేడా వస్తే ఏటీసీ నుంచే విమానాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఆటో పైలెట్‌ విధానంలో పైలెట్‌తో సంబంధం లేకుండానే విమాన గమనాన్ని నిర్దేశించవచ్చు. హెలికాప్టర్‌ పరిస్థితి అలాకాదు. పైలెట్‌ ఎల్లప్పుడూ భూమిని గమనిస్తూనే నడపాల్సి ఉంటుంది. అంటే మరీ ఎత్తుకు వెళ్లడం సాధ్యంకాదు. ఏదైనా అననుకూల పరిస్థితి వస్తే తనంత తాను నిర్ణయం తీసుకోవాలి. 

ఎంత సాంకేతికత ఉన్నా.. 

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం పైలెట్ ఎదురుగా ఉన్న డిజిటల్‌ తెరపై తాము ప్రయాణిస్తున్న మార్గంలో కొండలు, లోయల వంటివి కనిపిస్తుంటాయి. అందుకే చాలాసార్లు ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతుంటారు. కానీ వీటన్నింటికీ అతీతంగా అకస్మాత్తుగా సమస్య తలెత్తినప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పనట్లే. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో హెలికాప్టర్లు ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి అనూహ్య సమస్యలు సవాళ్లు విసురుతుంటాయని భారత వైమానిక దళ మాజీ అధికారి ఎం.ఎన్‌.రెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు.

అంతా నిమిషాల్లోనే.. 

హెలికాప్టర్‌ ప్రయాణంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు మేఘాలు, మంచు, వర్షం. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో హెలికాప్టర్‌ ప్రయాణిస్తుందనుకుంటే నిమిషానికి 1.66 కిలోమీటర్ల దూరం ముందుకు సాగుతుంది. అంటే హెలికాప్టర్‌ నడుపుతున్న పైలెట్‌కు ఏదైనా ప్రమాదం పసిగట్టి, గమన దిశ, ఎత్తు వంటివి మార్చుకోడానికి కనీసం మూడు నిమిషాలు పడుతుందనున్నా కనీసం ఐదు కిలోమీటర్ల దూరం స్పష్టంగా చూడగలగాలి. అంటే ఐదు కిలోమీటర్ల దూరంలో ఏదైనా కొండ ఉందని పసిగట్టగలిగినప్పుడే దాన్ని ఢీకొనకుండా తప్పించుకోవడానికి వీలవుతుంది. కాని ఎత్తైన కొండల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది. హెలికాప్టర్‌ బయలుదేరేటప్పుడు వాతావరణం అనుకూలంగానే ఉన్నా అనుకోకుండా మేఘాలు, మంచు తెరలు అడ్డం రావచ్చు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉపద్రవాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని