Covid Vaccine: టీకా.. మధ్యాహ్నమైతే మేలు!

మీరు కొవిడ్‌ టీకా ఏ సమయంలో తీసుకున్నారు? ఉదయమా.. మధ్యాహ్నమా? ఎప్పుడు తీసుకుంటే ఏంటని ఆలోచిస్తున్నారా? 

Published : 10 Dec 2021 12:40 IST

 తాజా అధ్యయనంలో వెల్లడి

లండన్‌: మీరు కొవిడ్‌ టీకా ఏ సమయంలో తీసుకున్నారు? ఉదయమా.. మధ్యాహ్నమా? ఎప్పుడు తీసుకుంటే ఏంటని ఆలోచిస్తున్నారా? కొవిడ్‌పై పోరులో మనిషి శరీరంలోని రోగనిరోధక శక్తి పాత్ర కీలకం. టీకాల ద్వారా శరీరం లోపల యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. రోజులో ఏ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకున్నామనే అంశంపైన యాంటీబాడీల సామర్థ్యం ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఉదయం కన్నా.. మధ్యాహ్న సమయంలో టీకాలు తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. జర్నల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ రిథం.. ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. మనిషి సర్కాడియన్‌ క్లాక్‌(24 గంటల కాలచక్రం)లో.. శరీరంపై వ్యాధి, టీకా ప్రభావానికి కూడా తగిన సమయం ఉంటుందని పేర్కొంది.

టీకా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు ఎలిజబెత్‌ క్లెర్మన్‌ తెలిపారు. వ్యాధి లక్షణాలు, దానిపై మందుల ప్రభావం కూడా సమయంపైనే ఆధారపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఉదాహరణకు.. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగులకు.. లక్షణాల తీవ్రత, శ్వాస తీసుకునే ప్రక్రియలో ఇబ్బందులు.. రోజులో ప్రత్యేకంగా కొన్ని సమయాల్లోనే వస్తాయన్నారు. బ్రిటన్‌లో.. టీకాలు తీసుకున్న 2,190 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన జరిగింది. టీకా తీసుకున్న సమయంలో ఎలాంటి లక్షణాలు లేని ఆరోగ్య కార్యకర్తల రక్త నమూనాలను సేకరించారు. టీకా తీసుకున్న సమయం, టీకా రకం, వయసు, లింగం ఆధారంగా యాంటీబాడీల స్థాయి ప్రభావాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం తర్వాత టీకాలు తీసుకున్న వారందరికీ యాంటీబాడీల స్పందన ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని