Britain: చైనా దూకుడుకు కళ్లెం వేస్తాం.. ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తాం

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా బలప్రదర్శన, ఆ దేశం అనుసరిస్తున్న దూకుడు వైఖరిపై జి-7 దేశాల సమావేశంలో వాడిగావేడిగా చర్చ జరుగుతోంది.

Published : 12 Dec 2021 12:03 IST

 ఉక్రెయిన్‌ పట్ల రష్యాది దుష్టవైఖరి

 జి-7 దేశాల సదస్సులో బ్రిటన్‌ ఉద్ఘాటన

లివర్‌ పూల్‌: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా బలప్రదర్శన, ఆ దేశం అనుసరిస్తున్న దూకుడు వైఖరిపై జి-7 దేశాల సమావేశంలో వాడిగావేడిగా చర్చ జరుగుతోంది. డ్రాగన్‌ను నిలువరిస్తామని, ఇందుకు ఆసియా దేశాలతో కలిసి పనిచేస్తామని బ్రిటన్‌ విస్పష్టం చేసింది. లివర్‌ పూల్‌లో శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ మూడు రోజుల సమావేశాన్ని ‘అంతర్జాతీయ దురాక్రమణదారులకు వ్యతిరేకంగా ఐక్యత ప్రదర్శన’గా బ్రిటన్‌ విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ అభివర్ణించారు. ఓవైపు చైనా, ఇరాన్‌లతో ఉద్రిక్తతలు పెరుగుతుంటే, మరోవైపు ఉక్రెయిన్‌ పట్ల రష్యా దుష్ట వైఖరిని అనుసరిస్తోందని ఆమె మండిపడ్డారు. కూటమి సభ్య దేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్‌ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

రష్యాపై ఆధారపడొద్దు

ఉక్రెయన్‌ సరిహద్దుల్లో రష్యా సైనిక, ఆయుధ మోహరింపులు పెరుగుతున్న నేపథ్యంలో- స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాలు రష్యన్‌ సహజవాయువు, నిధులపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తద్వారా తమ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని బ్రిటన్‌ పిలుపునిచ్చింది. రష్యా నుంచి జర్మనీకి సహజ వాయువును రవాణా చేయడానికి ఉద్దేశించిన నార్డ్‌ స్ట్రీమ్‌-2 గ్యాస్‌ పైపులైను ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకుని ట్రస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సహజ వాయువు కోసం ప్రజాస్వామ్య దేశాలు రష్యా మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. కాగా, నార్డ్‌ స్ట్రీమ్‌-2 పైపులైన్‌ను వ్యతిరేకిస్తున్న జర్మన్‌ గ్రీన్‌పార్టీ నాయకురాలు ఎనలీనా బేయర్‌ బాక్‌... విదేశాంగ మంత్రి హోదాలో సమావేశానికి హాజరయ్యారు. మెర్కెల్‌ నిష్కమ్రణ అనంతరం జర్మనీలో గ్రీన్‌ పార్టీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. రష్యన్‌ సహజవాయువు బ్రిటన్‌కు అవసరంలేదు కాబట్టే ఆ దేశం నార్డ్‌స్ట్రీమ్‌ను గట్టిగా వ్యతిరేకిస్తోందన్న ఆరోపణలున్నాయి. అయితే, లండన్‌ ఆర్థిక, స్థిరాస్తి మార్కెట్లలో రష్యన్‌ నిధులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చే అక్రమ ధనానికి లండన్‌ అడ్డాగా మారిందన్న విమర్శలు మాత్రం తప్పట్లేదు. రష్యా గనుక ఉక్రెయిన్‌పై దాడిచేస్తే తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అమెరికా, నాటో దేశాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఉక్రెయిన్‌పై దాడిచేసే ఉద్దేశం తమకు లేదనీ, ఉక్రెయినే తమపై దురాక్రమణకు పాల్పడాలని చూస్తోందని రష్యా ఆరోపిస్తోంది.

తైవాన్‌పైకి మళ్లీ డ్రాగన్‌ యుద్ధవిమానాలు

తైవాన్‌పై చైనా దుందుడుకు వైఖరి కొనసాగిస్తోంది. ఆ దేశంపై ఒత్తిడి పెంచే కవ్వింపు చర్యల్లో భాగంగా గగనతలంలోకి మరోసారి యుద్ధ విమానాలను పంపింది. మొత్తం 13 చైనా సైనిక విమానాలు తైవాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ ఐడెంటిఫికేషన్‌ జోన్‌లోకి శుక్రవారం ప్రవేశించినట్లు తైవాన్‌ రక్షణశాఖ ధ్రువీకరించింది. ఆఫ్రికా దేశమైన నికరాగువా తైవాన్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్నరోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మరోవైపు.. ఇదే రోజున అటు చైనాతో నికరాగువా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. తైవాన్‌ గగనతలంలోకి ప్రవేశించిన విమానాల్లో రెండు హెచ్‌-6 బాంబర్లు, ఓ వై-8 ఎలక్టాన్రిక్‌ వార్‌ఫేర్‌ విమానం ఉన్నట్లు తెలుస్తోంది. వై-8 యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ విమానంతోపాటు ఆరు షెన్యాంగ్‌ జే-16, రెండు చెంగ్డూ జే-10 ఫైటర్‌ జెట్‌ విమానాలు కూడా ఉన్నాయని తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. చైనాకు దీటుగా తాము సైతం వాయుసేన యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపినట్లు తైవాన్‌ తెలిపింది. చైనా విమానాలను హెచ్చరించేలా రేడియో సంకేతాలు పంపడంతోపాటు ఎయిర్‌ డిఫెన్స్‌ మిసైల్‌ వ్యవస్థను రంగంలోకి దించినట్లు వివరించింది. తైవాన్‌ను ఆక్రమించుకోవాలన్న లక్ష్యంతో చైనా ఇలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఏడాది కాలంగా తైవాన్‌పై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కి పైగా యుద్ధ విమానాలను ఆ దేశం మీదకు పంపింది. తైవాన్‌ను పూర్తిగా తమలో విలీనం చేసుకుంటామని, అవసరమైతే సైనికచర్యకు వెనుకాడబోయేది లేదని చెబుతోంది. 1949 సివిల్‌వార్‌ సమయంలో తైవాన్, చైనా విడిపోయాయి. అప్పటి నుంచి తైవాన్‌ స్వయం ప్రతిపత్తిని గుర్తించేందుకు డ్రాగన్‌ విముఖత చూపుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని