Afghanistan: మేం మారుతున్నాం..: తాలిబన్‌ మంత్రి ముత్తాఖీ

అఫ్గానిస్థాన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మధ్యయుగాల నాటి కఠోర పద్ధతులు పాటిస్తున్నారని యావత్‌ ప్రపంచం ఆగ్రహిస్తున్న వేళ వారు

Published : 14 Dec 2021 12:44 IST

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లు మధ్యయుగాల నాటి కఠోర పద్ధతులు పాటిస్తున్నారని యావత్‌ ప్రపంచం ఆగ్రహిస్తున్న వేళ వారు తమ పంథా మార్చుకుంటున్నామని ప్రకటించారు. బాలికలు విద్యాలయాలకు వెళ్లడానికీ, మహిళలు ఉద్యోగాలు చేసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నామని సోమవారం వెల్లడించారు. కొవిడ్, అంతర్యుద్ధం వల్ల అష్టకష్టాలు పడుతున్న కోట్ల మంది అఫ్గాన్‌ ప్రజల పట్ల ప్రపంచం కనికరం చూపి ఆదుకోవాలని తాలిబన్‌ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్‌ఖాన్‌ ముత్తాఖీ అభ్యర్థించారు. అమెరికాతో తమకు తగవు లేదనీ, ప్రపంచ దేశాలన్నింటితో సత్సంబంధాలు కోరుకుంటున్నామని కూడా స్పష్టం చేశారు. అమెరికా, ఇతర సంపన్న దేశాలు నిలిపివేసిన వెయ్యి కోట్ల డాలర్ల అఫ్గాన్‌ ప్రభుత్వ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల దేశం అస్థిరమవుతుందనీ, ప్రభుత్వం బలహీనపడుతుందనీ, దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదనీ ఆయన చెప్పారు. అఫ్గాన్‌లో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు నిరాటంకంగా పనిచేస్తున్నాయనీ, ఆరోగ్య సంరక్షణ రంగంలో పనిచేసిన మహిళలంతా తిరిగి విధులకు హాజరవుతున్నారనీ వెల్లడించారు.

గత ప్రభుత్వ అధికారులకు క్షమాభిక్ష  నాలుగు రాష్ట్రాల్లో పూర్వ ప్రభుత్వం కింద పనిచేసిన 100 మంది పోలీసు, నిఘా సంస్థల అధికారులను వధించడమో, అదృశ్యం చేయడమో జరిగిందని గత నెలలో హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది. అయితే, పూర్వ ప్రభుత్వ యంత్రాంగంలోని వారందరిపై తాలిబన్లు ప్రతీకార చర్యకు దిగలేదని, చాలామందికి క్షమాభిక్ష ప్రకటించామని ముత్తాఖీ తెలిపారు. 

ఐఎస్‌ను నియంత్రిస్తాం ఆగస్టులో అమెరికా సేనలు అఫ్గాన్‌ నుంచి నిష్క్రమించాక, అక్కడ అల్‌ ఖైదా కార్యకలాపాలు కొంత పెరిగాయని అమెరికా సేనాని ఫ్రాంక్‌ మెకంజీ గత వారం వాషింగ్టన్‌లో పేర్కొన్నారు. మెకంజీ ఆరోపణ నిరాధారమనీ, ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) దాడులు పెరిగిన మాట నిజమేనని ముత్తాఖీ తెలిపారు. క్రమంగా ఐఎస్‌ మీద పైచేయి సాధిస్తున్నామన్నారు. అయితే, ఐఎస్‌పై పోరాటానికి అమెరికాతో చేతులు కలిపే ఉద్దేశం లేదన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని