వెండితో వైద్యానికి బాటలు.. సులభంగా సూక్ష్మపదార్థాల తయారీ

సూక్ష్మ పదార్థాల తయారీలో మరో ముందడుగు! బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన యాంటీ-మైక్రోబియల్‌ ఔషధాల 

Published : 14 Dec 2021 12:47 IST

 ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌ పరిశోధకుల ఘనత

దిల్లీ: సూక్ష్మ పదార్థాల తయారీలో మరో ముందడుగు! బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌లకు వ్యతిరేకంగా సమర్థవంతమైన యాంటీ-మైక్రోబియల్‌ ఔషధాల తయారీకి దోహదపడేలా.. భోపాల్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. వెండితో సులభంగా, భద్రంగా సూక్ష్మ పదార్థాలను తయారుచేసే సరికొత్త విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. ‘‘భారత్‌లో మనుషులు, జంతువులకే కాకుండా వ్యవసాయంలోనూ యాంటీ-బయోటిక్స్‌ వినియోగం తీవ్రంగా ఉంది. కాలక్రమంలో వీటి ప్రభావం తగ్గిపోయి, ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సి వస్తోంది. దీంతో ఇన్‌ఫెక్షన్లపై సమర్థ పోరాటం చేసేందుకు అనువైన సూక్ష్మపదార్థాల తయారీపై దృష్టి సారించాం’’ అని పరిశోధనకర్త సప్తర్షి ముఖర్జీ వివరించారు. వెంట్రుకలో లక్షో వంతు మందంలో తయారుచేసిన వెండి రజనుకు యాంటీ-మైక్రోబియల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. 

ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పురాతన సంప్రదాయ వైద్యంలోనూ వెండిని ఉపయోగించి ఔషధాలను రూపొందించేవారు. వెండిని రజనుగా మార్చేందుకు హానికర పదార్థాలను ఉపయోగించడం పరిపాటిగా వస్తోందని, తాము మాత్రం ఇందుకు అమైనో ఆమ్లం, టైరోసిన్‌లను ఉపయోగించామని ముఖర్జీ తెలిపారు. ‘‘చిక్కుళ్లు, మాంసం, పాల ఉత్పత్తుల్లో టైరోసిన్‌ విరివిగా లభిస్తుంది. ఎన్నికల్లో ఓటర్ల చేతివేళ్లకు అద్దే సిరాలో ప్రధానంగా సిల్వర్‌ నైట్రేట్‌ అనే పదార్థం ఉంటుంది. దీన్ని టైరోసిన్‌తో మిళితం చేయగా... నానోక్లస్టర్, నానోపార్టికల్‌ పదార్థాలు ఉత్పత్తి అయ్యాయి. నానోపార్టికల్స్‌ కేవలం 4 గంటల్లోనే సూక్ష్మజీవులను నాశనం చేయడం విశేషం. తొలుత ఇవి సూక్ష్మజీవులపై ఉండే త్వచాన్ని ధ్వంసం చేసి, తర్వాత వాటిలో ఉండే ప్రొటీన్లు బయటకు వచ్చేలా చేస్తున్నాయి. తర్వాత వాటి అంతు చూస్తున్నాయి’’ అని పరిశోధనకర్తలు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని