Supreme Court: నిర్మాణ కార్మికులకు పరిహారం ఇస్తాం

 రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం భవన నిర్మాణ పనులు నిలిపివేసినందున ఉపాధి కోల్పోయిన కూలీలకు

Published : 16 Dec 2021 11:00 IST

సుప్రీంకు తెలిపిన రాజస్థాన్, యూపీ

దిల్లీ: రాజధాని ప్రాంతంలో కాలుష్య నివారణ కోసం భవన నిర్మాణ పనులు నిలిపివేసినందున ఉపాధి కోల్పోయిన కూలీలకు పరిహారం చెల్లిస్తామని రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాలు తెలిపాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు నవంబరు 24న ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం ముందు ప్రమాణ పత్రాలను సమర్పించాయి. రాజస్థాన్‌లోని ఆల్వార్, భరత్‌పుర్‌ జిల్లాలు దేశ రాజధాని ప్రాంతం పరిధిలోకి వస్తాయి. నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ.252 వంతున, అర్ధనైపుణ్యం ఉన్నవారికి రూ.264, నైపుణ్యంగల వారికి రూ.276 వంతున చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. 267 మందికి ఇవ్వనున్నట్టు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో వారానికి రూ.1000 వంతున ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 

ఓబీసీ వివరాలు ఇవ్వడం కుదరదు

సామాజిక-ఆర్థిక, కుల గణాంకాలు-2021ని ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించలేమని బుధవారం సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందులోని ఓబీసీల వివరాలను విశ్లేషించలేదని, అందువల్ల వాటిని అందజేయడం సాధ్యం కాదని మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. వీటిలో తప్పులు ఉన్నందున వివిధ అవసరాల కోసం వినియోగించడం సాధ్యం కాదని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తాము ఆదేశాలు ఇస్తే అది మరింత గందరగోళానికి దారి తీస్తుందని అభిప్రాయపడింది.

నగదు అక్రమ చలామణి కేసులోరాఘవ్‌ బహల్‌పై చర్యలు వద్దు

నగదు అక్రమ చలామణి కేసులో మీడియా రంగ ప్రముఖుడు రాఘవ్‌ బహల్‌కు బుధవారం సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ని ఆదేశించింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తొలుత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీకి నోటీసు ఇచ్చిన హైకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించడానికి మాత్రం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. నగదును అక్రమంగా తరలించి లండన్‌లో గుర్తు తెలియని ఆస్తిని కొనుగోలు చేశారంటూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన పన్నులన్నీ చెల్లించారని, అందువల్ల నగదును అక్రమంగా తరలించే ప్రశ్న తలెత్తదని బహల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ తెలిపారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనతో పాటు భార్య, కుమారుడు, కుమార్తెకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బహల్‌పై చర్యలు తీసుకోకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది.

రాజ్‌ కుంద్రాకు అరెస్టు నుంచి రక్షణ

అశ్లీల చిత్రాల వీడియోలను పంపిణీ చేస్తున్నారన్న కేసులో వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను అరెస్టు చేయకుండా బుధవారం సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి బాంబే హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిని జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని, అంతవరకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోకూడదని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నటుల అనుమతితోనే వాటిని చిత్రీకరించారని, వాటి రూపకల్పన, ప్రసారం చేయడంలో కుంద్రాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. యాప్‌ల ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేస్తున్నారన్న మరో కేసులో గతంలో ముంబయి పోలీసులు ఆయనను అరెస్టు చేయగా, సెప్టెంబరు నెలలో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని