ISIS: ఐసిస్‌లో 66 మంది భారత సంతతి ముష్కరులు 

కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)లో భారత సంతతికి చెందిన ముష్కరులు 66 మంది 

Updated : 18 Dec 2021 09:57 IST

తాజా నివేదికలో అమెరికా వెల్లడి 
ఉగ్రభూతంపై భారత్‌ భేషుగ్గా పోరాడుతోందంటూ కితాబు 

వాషింగ్టన్‌: కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)లో భారత సంతతికి చెందిన ముష్కరులు 66 మంది ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజా నివేదికలో వెల్లడించింది. ఉగ్ర భూతంపై పోరులో భారత్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందంటూ కితాబిచ్చింది. ఈ ఏడాది నవంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉగ్రవాదం ఏ స్థాయుల్లో ఉందో నివేదికలో వివరించింది. అందులోని వివరాల ప్రకారం.. గగనతల ప్రయాణికుల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం-2309’ను అమెరికాతో కలిసి భారత్‌ భేషుగ్గా అమలు చేస్తోంది. విమానాశ్రయాల్లో ఎక్స్‌-రేల ద్వారా కార్గో స్క్రీనింగ్‌ను సమగ్రంగా నిర్వహిస్తోంది. భారత్, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఉగ్ర రక్కసిపై పోరాడుతున్నాయి. అంతర్జాతీయ, ప్రాంతీయ ఉగ్ర శక్తులను గుర్తించడంలో, వాటికి ముకుతాడు వేయడంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సహా భారత ఉగ్ర నిరోధక బలగాలు భేషుగ్గా పనిచేస్తున్నాయి.

రాష్ట్రాల స్థాయుల్లోనూ పలు విభాగాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఐసిస్‌కు సంబంధించి 34 కేసులను పరిశీలించిన ఎన్‌ఐఏ.. 160 మందిని అరెస్టు చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 19-26 తేదీల మధ్య అరెస్టయిన 10 మంది అల్‌-ఖైదా ఉగ్రవాదులు కూడా అందులో ఉన్నారు. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హజ్‌బుల్‌ ముజాహిదీన్, ఐఎస్‌ఐఎస్, అల్‌-ఖైదా ముష్కర సంస్థలు భారత ఉపఖండంలో క్రియాశీలకంగా ఉన్నాయి. గత ఏడాది జమ్మూ-కశ్మీర్, ఈశాన్య భారత్‌తో పాటు మధ్య భారత్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉగ్ర కార్యకలాపాలు చోటుచేసుకున్నాయి. తమ భూభాగం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ముష్కర సంస్థలన్నింటినీ నాశనం చేస్తామంటూ 2015 జాతీయ కార్యాచరణ ప్రణాళికలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పాకిస్థాన్‌ పరిమితంగానే పురోగతి సాధించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని